పచ్చని పొలాల్లో ఆక్వా చిచ్చు | - | Sakshi
Sakshi News home page

పచ్చని పొలాల్లో ఆక్వా చిచ్చు

Published Wed, Mar 12 2025 7:47 AM | Last Updated on Wed, Mar 12 2025 7:43 AM

పచ్చన

పచ్చని పొలాల్లో ఆక్వా చిచ్చు

యథేచ్ఛగా సాగుతున్న అక్రమ తవ్వకాలు

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

కుదేలవుతున్న కోనసీమ కల్పవృక్షం

ముమ్మిడివరం: పచ్చని పొలాలు ఆక్వా చెరువులుగా మారుతున్నాయి. నిబంధనలను తుంగలోకి తొక్కి అక్రమ చెరువుల తవ్వకాలతో పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు. ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు, అధిక పెట్టుబడి తదితర కారణాలతో వరుస నష్టాలకు గురవుతున్న బడా రైతులు.. వ్యవసాయాన్ని పక్కనబెట్టి చెరువుల సాగుపై దృష్టి సారిస్తున్నారు. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలను సైతం తెగనరికి ఆక్వా చెరువులుగా మార్చేస్తున్నారు. గతంలో సముద్ర తీర ప్రాంతాల్లోను, చౌడు, బీడు భూముల్లో, ఎటువంటి పంటలు పండని భూముల్లో చెరువులు తవ్వి ఆక్వా సాగు చేసేవారు. ఇప్పుడు సారవంతమైన భూములు, పొలాలు, కొబ్బరి తోటలు ఆక్వా చెరువులుగా మారుతుండడంతో జల కాలుష్యం విచ్చలవిడిగా పెరిగిపోతోంది.

ఎటువంటి అనుమతులు లేకుండా..

ఆక్వా సాగుకు చెరువులు తవ్వాలంటే రెవెన్యూ, ఫిషరీస్‌, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్‌, డ్రైనేజీ, పొల్యూషన్‌ వంటి శాఖల అనుమతి తీసుకుని చెరువులు తవ్వాల్సి ఉంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పంట కాలువలు, ఏటిగట్ల చెంతనే ఎటువంటి అనుమతులు లేకుండా, యథేచ్ఛగా చెరువులను తవ్వుతున్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల అక్రమ చెరువుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పచ్చని చేలు, కొబ్బరి తోటలు చెరువులుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ముమ్మిడివరం మండలంలోని అయినాపురం పంట కాలువ చెంతనే సర్వే నంబర్‌ 82/1, 79/1లో సుమారు ఏడు ఎకరాల్లో కొబ్బరి తోటల్లో చెట్లను నరికి, బొబ్బర్లంక–పల్లంకుర్రు ప్రధాన పంట కాలువను ఆనుకుని ఆక్వా చెరువులు తవ్వేస్తున్నారు. ఇదే మండలంలో సోమిదేవరపాలెం పంచాయతీ పరిధిలో కొబ్బరి తోటలను నరికి ఆక్వా చెరువుల తవ్వకాలు చేపట్టారు. చెరువుల్లో తవ్వుతున్న మట్టిని పక్కనున్న మురుగు డ్రెయిన్‌కు అడ్డంగా అడ్డుకట్ట వేసి, ట్రాక్టర్లపై మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

నేలకొరుగుతున్న కల్పవృక్షం

కోనసీమ కల్పవృక్షాలు నేలకొరుగుతున్నాయి. కన్నబిడ్డ కంటే అమితంగా ఆదరించే రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. నెలసరి ఆదాయం సమకూరుస్తూ జీవితాంతం ఫలసాయం అందించే కొబ్బరి చెటు్‌ట్‌ కోనసీమవాసుల జీవితాలతో ముడిపడి ఉంది. ఇంటి పెరట్లో, కాలువ గట్లు, మురుగు డ్రెయిన్లు, ప్రభుత్వ ఆక్రమిత భూముల్లో కొబ్బరి చెట్లను పెంచుతూ జీవనోపాధి పొందడం కోనసీమ ప్రజలకు పరిపాటి. ఏదో నెపంతో చెట్లను నరికి, వారి జీవనోపాధికి గండి కొడుతూనే ఉన్నారు. ఇప్పటికే రోడ్ల విస్తరణ, కాలువల ఆధునికీకరణ పేరుతో వేలాది కొబ్బరి చెట్లను నరికేశారు. గతంలో ఏటిగట్ల ఆధునికీకరణ పేరుతో వేలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. కోనసీమలో 216 జాతీయ రహదారి విస్తరణ, బైపాస్‌ రోడ్డు నిర్మాణాల పేరుతో వేలాది చెట్లను నరికివేశారు. ఇప్పుడు కొంత మంది రైతులు లాభార్జనే ధ్యేయంగా కొబ్బరి తోటలను నరికి ఆక్వా చెరువులు తవ్వుతున్నారు. దీంతో భవిష్యత్తులో కోనసీమలో కొబ్బరి తోటల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయంపై దుష్ప్రభావం

పలు ప్రాంతాలలో వరిచేలను చెరువులుగా మార్చేస్తుండడంతో సమీపంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి చెరువులకు బదులుగా ఉప్పునీటి చెరువులుగా మార్చడంతో తమ పంటచేలలోకి ఊటనీరు ప్రవేశించి పంట నాశనం అవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటేటా ఇలా చెరువులు తవ్వుకుంటూ పోతే వ్యవసాయం కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తుతుందని, కనీసం తిండిగింజలు కూడా దక్కని దుస్థితి నెలకొంటుందని పలువురు రైతులు వాపోతున్నారు. అక్రమ తవ్వకాలను నిలువరించాలని కోరుతున్నారు.

పర్యావరణానికి విఘాతం

గ్రామంలో రోడ్లపై మట్టి ట్రాక్టర్లు విచ్చలవిడిగా సంచరించడంతో దుమ్ముధూళి చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పచ్చని పొలాల మధ్య ఆక్వా సాగు చేయడం వల్ల పచ్చదనం కరువై, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు తవ్వేందుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమ చెరువుల తవ్వకాలు సాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
పచ్చని పొలాల్లో ఆక్వా చిచ్చు1
1/3

పచ్చని పొలాల్లో ఆక్వా చిచ్చు

పచ్చని పొలాల్లో ఆక్వా చిచ్చు2
2/3

పచ్చని పొలాల్లో ఆక్వా చిచ్చు

పచ్చని పొలాల్లో ఆక్వా చిచ్చు3
3/3

పచ్చని పొలాల్లో ఆక్వా చిచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement