భర్తీ లేదు.. భృతి రాదు | - | Sakshi
Sakshi News home page

భర్తీ లేదు.. భృతి రాదు

Published Wed, Mar 12 2025 7:47 AM | Last Updated on Wed, Mar 12 2025 7:43 AM

భర్తీ

భర్తీ లేదు.. భృతి రాదు

యువతకు సర్కారు దగా

కూటమి ప్రభుత్వంలో కొత్త కొలువులు లేవు

సంతకం పెట్టినా డీఎస్సీ ద్వారా భర్తీ కాని 890 పోస్టులు

7,500 మంది ఆశలపై నీళ్లు

ఇస్తానన్న నిరుద్యోగ భృతి అందలేదు

సుమారు లక్ష మంది ఎదురుతెన్నులు

రీయింబర్స్‌మెంట్‌ లేదు

సంక్షేమ హాస్టల్స్‌ విద్యార్థులకు

అందని సొమ్ము

నేడు వైఎస్సార్‌ సీపీ యువత పోరు

సాక్షి, అమలాపురం: ‘అధికారంలోకి రాగానే వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తాము. ఆ పరిస్థితి లేకుంటే నెలనెలా నిరుద్యోగ భృతి అందిస్తాము’ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఇవి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. మెగా డీఎస్సీ ఏర్పాటు చేస్తాము. వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాము. జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము. స్థానికంగా వేలాది ఉద్యోగాలు కల్పిస్తాము. ఎంఎస్‌ఎంఈ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్‌లతో చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని నిరుద్యోగ యువతకు అయితే ఉద్యోగాలు, లేదా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. ఇవేమీ లేకుంటే నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతి అందజేస్తామన్నారు.

ఇవే కాదు.. క్రమం తప్పకుండా ఫీజులు రీయింబర్స్‌మెంట్‌ అందించడం, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, విద్యార్థులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇస్తామని ఊదరగొట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలోనే కాదు. బాబు నిర్వహించిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ... పవన్‌ కళ్యాణ్‌ నిర్వహించిన వారాహీ యాత్రలలో యువత లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు. తొమ్మిది నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు.

వలంటీర్ల వ్యవస్థ ఎత్తివేత

గత ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఎత్తి వేసింది. గత ప్రభుత్వం వీరికి రూ.ఐదు వేలు గౌరవ వేతనం చొప్పున ఇచ్చేది. కూటమి ప్రభుత్వం రూ.పది వేలు ఇస్తామని మొత్తం వ్యవస్థను తీసివేసింది. బాబు వస్తే కొత్త జాబు రాలేదు సరికదా జిల్లాలో 9,581 మంది వలంటీర్లకు ఉన్న ఉద్యోగం కూడా పోయింది.

సర్వేలకు మాత్రమే సచివాలయ సిబ్బంది

గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయం, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే)ల ద్వారా సొంత జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. జిల్లావ్యాప్తంగా 512 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. 4,096 మందికి ఈ జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగాలు అందించారు. కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తోంది. భూముల రిజిస్ట్రేషన్‌లు సైతం చేసే స్థాయికి ఎదిగిన సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం సర్వేలకు మాత్రమే పరిమితం చేసింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు

గత ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన 8,824 మంది విద్యార్థులకు రూ.6.14 కోట్లు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దీని పేరు రీయింబర్స్‌మెంట్‌ ఆఫ్‌ ట్యూషన్‌ ఫీజుగా మార్చి (ఆర్‌టీఎఫ్‌) 2024,25 సంవత్సరానికి 7,210 మందికి రూ.8.33 కోట్లు విడుదల చేశారు. వసతి దీవెన పథకం పేరును మెయింటినెన్స్‌ ఆఫ్‌ ట్యూషన్‌ ఫీజు (ఎంటీఎఫ్‌)గా మార్చి రూ.1.39 కోట్లు విడుదల చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా 1.62 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.243 కోట్లు జమ అయ్యేవి. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంగా పేరు మార్పు చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.

నేడు యువత పోరు

అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా యువతను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌ సీపీ సమర శంఖం పూరించింది. బుధవారం జిల్లా కేంద్రం అమలాపురంలో కలెక్టరేట్‌ వద్ద యువత పోరులో భాగంగా ధర్నా చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమానికి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలి రానున్నారు.

డీఎస్సీ ప్రకటనేనా!

సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన వెంటనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. కాని ఇంత వరకు ప్రకటన వెలువడలేదు. పరీక్షలు నిర్వహించకుండా వాయిదాపై వాయిదాలు వేస్తున్నారు. జిల్లాలో కనీసం 840 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఇందుకు 8 వేల మందికి పైగా అర్హులు ఎదురు తెన్నులు చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
భర్తీ లేదు.. భృతి రాదు1
1/1

భర్తీ లేదు.. భృతి రాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement