ఆర్థిక ప్రగతికి బ్యాంకర్ల భాగస్వామ్యం
అమలాపురం రూరల్: జిల్లా ఆర్థిక ప్రగతికి, ప్రజల సంక్షేమానికి బ్యాంకర్ల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. నాలుగో త్రైమాసికానికి సంబంధించి జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశాలు కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశాలకు కలెక్టర్ అధ్యక్షత వహించారు. 2024–25 జిల్లా వార్షిక ప్రణాళిక లక్ష్య సాధన పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంక్షేమ పథకాల లక్ష్యాలకు అనుగుణంగా రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులకు తప్పనిసరిగా పంట రుణాలు అందించాలన్నారు. రూ.10 కోట్ల లోపు వ్యయంతో నిర్మించే వంతెనలకు రుణాలు అందించే యోచన చేయాలని, దీనిని టోల్ రూపంలో వసూలు చేసి, తిరిగి చెల్లిస్తారని చెప్పారు. వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి సంబంధించి గత డిసెంబర్ నాటికి 94.53 శాతం, ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి 103.91 శాతం మేర లక్ష్యాన్ని సాధించారని తెలిపారు. వివిధ పథకాలపై కూడా ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో ఆర్‌బీఐ మేనేజర్ నవీన్, లీడ్ బ్యాంక్ కన్వీనర్ సాయి మనోహర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి.కేశవవర్మ, డీఆర్‌డీఏ పీడీ శివశంకర ప్రసాద్, వ్యవసాయ అధికారి బోసుబాబు, ఈపీడీసీఎల్ ఎస్‌ఈ ఎస్.రాజబాబు, సిడ్బీ కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జియో టెక్స్‌టైల్ మ్యాట్లు వేయాలి
సెంట్రల్ డెల్టాలో భూ స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని రోడ్లు, ఏటిగట్లు, పంట కాలువలు, మురుగు కాలువల గట్లు జారిపోకుండా కొబ్బరి పీచుతో తయారు చేసిన జియో టెక్స్‌టైల్ మ్యాట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. వివిధ విభాగాల ఇంజినీర్లతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి మంజూరయ్యే రోడ్ల నిర్మాణాల్లో అధునాతన సాంకేతికతను జోడించేలా ప్రతిపాదించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment