
త్వరలో అసంపూర్తి భవనాలను పూర్తి చేస్తాం
ఇన్‌ఫ్రా జాయింట్ డైరెక్టర్ రామలింగం
రాయవరం: మనబడి–మన భవిష్యత్తు పథకంలో అసంపూర్తిగా ఉన్న భవనాలను త్వరలోనే పూర్తి చేయనున్నట్టు కమిషనర్ ఆఫ్ స్కూల్స్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ప్రోగ్రాం డైరెక్టర్ మువ్వా రామలింగం తెలిపారు. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ప్రాధాన్య క్రమంలో నిధులను కేటాయించి, పనులను పూర్తి చేయనున్నట్టు చెప్పారు. మండలంలో పదో తరగతి పాఠశాలల తనిఖీ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సీబీఎస్‌ఈ, హైస్కూల్ ప్లస్ పాఠశాలలను విరమించుకునే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత సంస్కరణలకు అనుగుణంగా పనులను పూర్తి చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేయనున్నట్టు తెలిపారు. మనబడి–మన భవిష్యత్తులో తాగునీరు, విద్యుద్దీకరణ, కిచెన్ షెడ్లు, టాయిలెట్లు, మేజర్, మైనర్ రిపేర్లు, గ్రీన్‌చాక్ బోర్డు, పెయింటింగ్ వంటి పనులను విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా పూర్తి చేస్తామని వివరించారు. అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి చేస్తామన్నారు. సిమెంట్ అవసరమైన పాఠశాలల్లో నిర్మాణాలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
జిల్లాలో పది పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేనట్టు నిర్వహిస్తున్నట్టు పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు రామలింగం తెలిపారు. చెల్లూరు, పసలపూడి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారన్నారు. కింద కూర్చుని పరీక్షలు రాయకుండా, అన్నిచోట్ల ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment