అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి

Published Fri, Mar 21 2025 12:13 AM | Last Updated on Fri, Mar 21 2025 12:12 AM

అక్షర

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి

కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం

ప్రచార మాధ్యమాలు పెరిగిన ప్రస్తుత తరుణంలో సాహిత్యం మరింతగా అందుబాటులోకి వస్తోంది. తెలుగు భాషపట్ల ఆసక్తి ఉన్నవారు కవితలు, కథలు రాసేందుకు ముందుకొస్తున్నారు. అయితే వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందడం లేదు. స్వశక్తితో తమ కవిత్వాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కవులు అనేక వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారు.

అద్దం అరచేతిలో ఇమిడిపోయేదే అయినా.. ఆకాశాన్ని చూపిస్తుంది. చూడటానికి చిన్నగానే కనిపించినా.. జాబిల్లి జగతికి చల్లని వెలుగులను పంచుతుంది. పుస్తకం చిన్నదే అయినా మస్తిష్కానికి వికాసాన్నిస్తుంది. అక్షరం చిన్నదే అయినా నిత్య చైతన్య దీప్తిని, స్ఫూర్తిని నింపుతుంది. కవితా వాహినిగా మారి.. మనిషి లోపల దాగున్న అసలు మనిషిని నిత్యం పరిచయం చేస్తుంది. అర్థం చేసుకునే మనసుతో చదివితే.. నడవడికలో లోపాలను చక్కదిద్ది మనిషిని మనీషిగా చక్కదిద్దుతుంది. మానవ సమాజాన్ని మరో ప్రపంచ వైపు నడిపిస్తుంది.

ఇదీ నేపథ్యం

ఐక్యరాజ్య సమితి విద్యా, శాసీ్త్రయ, సాంస్కృతిక సంస్థ మార్చి 21వ తేదీన ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహించాలని 1999లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో భాషా వైవిధ్యానికి మద్దతు పలికేందుకు, అంతరించిపోతున్న భాషలను ప్రోత్సహించేందుకు, కవిత్వాన్ని ప్రోత్సహించేందుకు 27 ఏళ్లుగా కృషి సాగుతోంది.

కపిలేశ్వరపురం: గోదారి నేలపై పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలనే వస్తువుగా స్వీకరించి ఎంతో మంది కవులు అపార సాహిత్యాన్ని సృజించారు. సమాజోద్ధరణకు శ్రమించారు. ఆవంత్స సోమసుందర్‌, బోయి భీమన్న, అద్దేపల్లి రామమోహనరావు, దాట్ల దేవదానంరాజు వంటి ప్రముఖులతో పాటు.. ఎంతో మంది కవులు ప్రపంచం నలుమూలలా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలకు గురైన పీడితులపై ద్రవించిన హృదయంతో స్పందించారు. నేడు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

గోదారి తీరాన కవిచంద్రులు

● పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 6వ అధిపతి కవిశేఖర డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా విశేషంగా సాహిత్యాన్ని సృజియించారు. 1885 ఫిబ్రవరి 28న ఆయన జన్మించారు. మాతృ భాష కానప్పటికీ తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కాకినాడలో ఆయన జయంతి ఘనంగా నిర్వహించారు.

● దేవులపల్లి కృష్ణశాస్త్రి సామర్లకోట మండలం చంద్రపాలెంలో 1897 నవంబరు 1న జన్మించారు. లలిత గీతాలు, నాటికలు, సినిమా పాటలు రాసి, ఎంతో ఖ్యాతి పొందారు. భావ కవిత్వానికి పెట్టింది పేరు.

● ‘బలం కలవాడు పులి, తెలివి కలవాడు నక్క, ఈ ఇరువర్గాలకో ఆహారంగా బతుకుతున్న వర్గాలు గొర్రెలు’ అంటూ చైతన్యపూరిత మాటలు రాసిన బోయి భీమన్న కోనసీమ జిల్లాలోని మామిడికుదురులో 1911 సెప్టెంబర్‌ 19న జన్మించారు. సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్‌తో పాటు లెక్కకు మిక్కిలిగా సన్మానాలందుకున్నారు. అంటరానితనం వంటి దురాచారాలను నిరసించారు.

● 1924 నవంబర్‌ 18న కాకినాడ జిల్లా శంఖవరంలో పుట్టిన ఆవంత్స సోమసుందర్‌ సాహిత్య రంగంలో అవిరళ కృషి చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాడు సాగిన ఉద్యమానికి మద్దతుగా ఆయన రచించిన ‘వజ్రాయుధం’ కవిత ఎంతో మందిని ఉత్తేజపరచింది.

● కాకినాడకు చెందిన అద్దేపల్లి రామమోహనరావు జిల్లా నలుమూలలా సాహిత్య సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు నిర్వహించేవారు. తుది శ్వాస విడిచిన 2016 వరకూ సాహిత్య కృషి చేశారు. ‘అయినా ధైర్యంగానే’ పేరుతో అద్దేపల్లి రాసిన కవితలు సామాన్యుడి జీవన స్థితిగతులను తడుముతాయి.

● యానాంలో నివసిస్తున్న ప్రముఖ కవి, కథకుడు దాట్ల దేవదానం రాజు. అభ్యుదయవాది అయిన ఆయన అనేక కథలు, కవితా సంపుటాలు వెలువరించారు. ‘యానాం చరిత్ర’ వంటి గ్రంథాలను వెలువరించారు. అనేక పురస్కారాలు అందుకున్నారు.

● 1994 ప్రాంతంలో పాశర్లపూడిలో సంభవించిన బ్లో ఔట్‌నే వస్తువుగా చేసుకుని ఓ కవి ఆ రోజుల్లో అద్భుతమైన కవిత రాశారు. ‘సామ్రాజ్యవాద కాలధూమాల నీడల కింద శిరస్సు తెగి, మొండెంలోంచుబికిన నెత్తుటి ధార, ముద్దయి నింగికెగురుతున్న శైలంలాగ, రాత్రి సూర్యుడై ప్రజ్వలిస్తోంది, గ్యాస్‌ బావి పాదాల చెంత పారాడే చిత్తడి.. పోరాటానికి సిద్ధమైన ప్రత్యర్థిలా వేడి సెగ వాగయింది’ అంటూ ఆయన కవిత్వం సాగుతుంది. ఇలా ఎంతో మంది తమ కవితా ఝరులతో చైతన్య స్ఫూర్తిని నింపారు.

సాహితీ ‘గోదారి’

● గోదారి నేలపై ఎంతో మంది సాహితీ సేద్యం సాగిస్తున్నారు.

● ‘కవిత కోసమే నేను పుట్టాను.. క్రాంతి కోసము కలము పట్టాను.. ఎండమావులు చెరిపి.. పండు వెన్నెల నిలిపి.. గుండె వాకిలి తలుపు తట్టాను’ అన్న ఆరుద్రను సత్కరించిన ప్రాంతం రాజమహేంద్రవరం.

● అభ్యుదయ కవి డాక్టర్‌ అద్దేపల్లి రామమోహనరావు పేరిట అద్దేపల్లి ఉదయ భాస్కరరావు కన్వీనర్‌గా ‘అద్దేపల్లి సాహిత్య వేదిక’ను నిర్వహిస్తున్నారు. ఏటా సాహిత్య పురస్కారాలు అందజేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ 8న రాజమహేంద్రవరానికి చెందిన ‘ప్రాణహిత’ కవి సాహితీవేత్త సన్నిధానం నరసింహశర్మకు ‘అద్దేపల్లి సాహిత్య పురస్కారం 2024’ను కాకినాడలో అందజేశారు.

● కొత్తపేటలో కళాసాహితి పేరుతో 37 ఏళ్లుగా సాహిత్య కృషి సాగిస్తున్నారు. 1989 నుంచి క్రమం తప్పకుండా ఉగాది రోజున కవి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ 7న నిర్వహించిన కార్యక్రమంలో కవి గిడ్డి సుబ్బారావును సత్కరించారు.

● కోనసీమకు చెందిన శ్రీశ్రీ కళావేదిక గత ఏడాది ఏప్రిల్‌ 7న అమలాపురంలో 132వ ఉగాది జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించగా పలు రాష్ట్రాల నుంచి 132 మంది కవులు పాల్గొన్నారు. 2024 సెప్టెంబర్‌ 21న కాకినాడలో 137వ జాతీయ కవి సమ్మేళనాన్ని నిర్వహించారు.

● రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో గత ఏడాది మార్చి 16న కవి కుసుమ ధర్మన్న 125వ జయంతి సందర్భంగా కవితా గోష్టి నిర్వహించారు.

● గత ఏడాది ఏప్రిల్‌ 14న బండారులంకలో నిర్వహించిన అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జిల్లా మహాసభలో ప్రతిభ చూపిన కవులను ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్న పెనుగొండ లక్ష్మీనారాయణ సత్కరించారు.

● కాకినాడకు చెందిన డాక్టర్‌ జోస్యుల కృష్ణబాబు పేరుగాంచిన పుస్తకాలకు సమీక్షలు రాస్తున్నారు.

● ఈ ప్రాంతానికి చెందిన ఎంతో కవులు వివిధ ప్రతిష్టాత్మక సంస్థల నుంచి పురస్కారాలు అందుకుంటున్నారు.

నేడు ప్రపంచ కవితా దినోత్సవం

కవుల సంఖ్య విస్తృతమైంది

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కవితలు రాసేవారి సంఖ్య పెరిగింది. ఆధునిక సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ప్రాచుర్యం పొందిన కవితల పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని అధ్యయనం చేస్తూ కవితలు రాసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. వచన కవిత్వం ప్రాచుర్యంలో ఉంది. కాకినాడ, పెద్దాపురం తదితర ప్రాంతాల్లోని యువ కవులను ప్రోత్సహిస్తున్నాం. సామాన్యుల జీవన శైలినే కవితా వస్తువుగా తీసుకుని కవితలు రాయడం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేయవచ్చు.

– అద్దేపల్లి ప్రభు, కవి, కాకినాడ

క్రమం తప్పకుండా..

యానాం వేదికగా కవి సంధ్య, స్ఫూ ర్తి సాహితీ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఏడేళ్లుగా క్రమం తప్పకుండా ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహిస్తున్నాం. కార్యక్రమ విస్తృతి ఆవశ్యకత నేపథ్యంలో ఈ నెల 23న హైదరాబాద్‌లో నిర్వహించనున్నాం. ఆధునిక కాలంలో సైతం కవిత్వ రచన పట్ల ఆసక్తి పుష్కలంగా ఉంది. అయితే పదబంధాలు, మెళకువలు నేర్పే యంత్రాంగం అందుబా టులో లేదు. సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూండాలి. పఠనాసక్తి పెంపొందించేందుకు కృషి చేయాలి.

– దాట్ల దేవదానం రాజు, కవి, తెలుగు విశ్వ

విద్యాలయం కీర్తి పురస్కార గ్రహీత, యానాం

మనిషిలో మనీషిని పరిచయం

చేస్తున్న కవులు

గోదారి నేలపై కవితా వాహిని

సామాజిక సమస్యలపై స్పందిస్తున్న కవులెందరో..

సామాన్యుల జీవితాలే కవితా వస్తువు

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మండపేటలో అరసం, సంగమం వేదిక సంయుక్త ఆధ్వర్యాన శుక్రవారం కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం. మనిషి శ్రమ నుంచి సాహిత్యం పుట్టింది. శ్రమకు విలువ ఉన్నంత కాలం కవిత్వానికి ప్రాధాన్యం తప్పనిసరిగా కొనసాగుతుంది. ప్రస్తుత కాలంలో యువతీ యువకులు సాహిత్య కృషిపై ఆసక్తి చూపుతున్నారు.

– డాక్టర్‌ చల్లా రవికుమార్‌, సంగమం వేదిక

నిర్వాహకుడు, మండపేట

No comments yet. Be the first to comment!
Add a comment
అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి1
1/7

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి2
2/7

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి3
3/7

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి4
4/7

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి5
5/7

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి6
6/7

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి7
7/7

అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement