మాలలపై కక్ష గట్టిన చంద్రబాబు
అమలాపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు మాలలపై కక్షతో ఎస్సీ వర్గీకరణను అడ్డగోలుగా చేయడానికి కుట్ర పన్నుతున్నారని జిల్లా మాల సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ జంగా బాబూరావు ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీల్లో ఓ వర్గానికి లబ్ధి చేకూర్చేలా పావులు కదుపుతున్నారని విమర్శించారు. స్థానిక ప్రెస్ క్లబ్ భవనంలో ఐక్య వేదిక ప్రతినిధులు బుధవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 22 మండలాల మాల ముఖ్య నాయకులు పాల్గొని, కార్యాచరణపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని సమావేశం పిలుపునిచ్చింది. దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. 2021 జనాభా లెక్కల ప్రకారం ఏకసభ్య కమిషన్ నివేదికను రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం సిగ్గుచేటని నాయకులు దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా పనిచేస్తోందని ఆరోపించారు. వర్గీకరణ వల్ల మాల, ఎస్సీల్లోని 59 ఉప కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏకసభ్య కమిషన్ నివేదికను రద్దు చేసి, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో త్రిసభ్య కమిషన్‌ను నియమించి, న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2025 కుల గణనను పరిగణనలోకి తీసుకుని, ఉప కులాల అభిప్రాయాలు విన్న తర్వాతే వర్గీకరణ జోలికి వెళ్లాలని సూచించారు. మాలల ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీవ్రతరం చేస్తామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఐక్యవేదిక ప్రతినిధి, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజు హెచ్చరించారు.
కలెక్టరేట్ వద్ద ధర్నా
అనంతరం ఐక్య వేదిక నాయకులు జిల్లా కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళ్లి, అక్కడ ధర్నా నిర్వహించారు. మాలల పంతం.. చంద్రబాబు అంతం, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని డీఆర్వోకు అందజేశారు. ఐక్యవేదిక నాయకులు రేవు తిరుపతిరావు, గెడ్డం సురేష్‌కుమార్, పొలమూరి మోహన్‌బాబు, పెనుమాల చిట్టిబాబు, దేవరపల్లి శాంతికుమార్, జిత్తుక సత్యనారాయణ, ఉబ్బన శ్రీను, నెల్లి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
కమిషన్ నివేదికను
రద్దు చేయాలని డిమాండ్
కలెక్టరేట్ వద్ద జిల్లా
మాల సంఘాల ఐక్య వేదిక ధర్నా
Comments
Please login to add a commentAdd a comment