
దళిత హక్కుల పరిరక్షణకు పోరు
జిల్లా మహాసభలో డిహెచ్పీఎస్ నేతలు
మలికిపురం: దళిత హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభలో డిహెచ్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామరాజులంక గ్రామంలో అంబేడ్కర్ స్మృతి వనంలో ప్రముఖ న్యాయవాది దళిత నాయకులు దేవ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జిల్లా డిహెచ్పీఎస్ మహాసభను నిర్వహించారు. తొలుత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, డిహెచ్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో డిహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జేవీ ప్రభాకర్ మాట్లాడుతూ ఈ దేశంలో దళిత వర్గాలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, అవకాశాలను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందన్నారు. దళిత వర్గాలను విభజించి దళితుల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలని దళిత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఇసుకపట్ల రఘుబాబు అన్నారు. క్రిస్టియన్ ఫెలోషిప్ బాధ్యులు దేవ ప్రవీణ్ మాట్లాడారు. అనంతరం డిహెచ్పీఎస్ జిల్లా కమిటీని నాయకులు ప్రకటించారు. డిహెచ్పీఎస్ జిల్లా గౌరవాధ్యక్షులుగా దేవ రాజేంద్రప్రసాద్, అధ్యక్షులుగా నల్లి బుజ్జిబాబు, ప్రధాన కార్యదర్శి మోకా శ్రీనివాసరావులతో పాటుగా మరో 11 మంది జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐటీయూసీ నాయకులు కె.సత్తిబాబు బహుజన సమన్వయ సమైక్య అధ్యక్షుడు గెడ్డం తులసీభాస్కరరావు, బత్తుల లక్ష్మణరావు, నల్లి శివకుమార్, గెడ్డం ఫిలిప్ రాజు, బత్తుల మురళీకష్ణ, మట్టా సురేశ్‌కుమార్, దేవ సురేష్‌బాబు, దొండపాటి చిట్టిరాజు, గెడ్డం పెర్రాజు, పుల్లెళ్ళ ఆనంద్, రాపాక మహేష్, చిలకపాటి శ్రీధర్, కొల్లాబత్తుల సతీష్, కలిగితి పళ్ళం రాజు, నల్లి శ్రీనివాస్, తాడి సహదేవుడు, జిల్లెళ్ళ మనోహర్ పాల్గొన్నారు.