
అవినీతికి తావు లేకుండా పింఛన్ల పంపిణీ
అమలాపురం రూరల్: సామాజిక భద్రతా పింఛన్లు క్షేత్ర స్థాయిలో అవినీతికి అక్రమాలకు తావు లేకుండా పంపిణీ చేయాలని జిల్లా ఇన్‌చార్జి అధికారి పటాన్‌శెట్టి రవి సుభాష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రూరల్ మండల పరిధిలోని సవరప్పాలెం గ్రామంలో ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్న తీరును, ఫేషియల్ యాప్‌లో నమోదు అక్విటెన్స్ స్వీకరణ ప్రక్రియలను ఆయన తనిఖీ చేశారు. పంపిణీ పరంగా గుర్తించిన చిన్న చిన్న లోపాలపై పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల సంతృప్తి స్థాయిలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ జిల్లావ్యాప్తంగా 2,35,887 మంది పింఛను దారులు ఉన్నారని, వీరికి రూ.100 కోట్ల 90 లక్షలు పంపిణీ చేస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేసి పింఛన్లు పంపిణీ సజావుగా సాగేలా మార్గ నిర్దేశం చేశారు.
కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు ఇంటి వద్ద పింఛన్ మొత్తాన్ని అందించేలా చూడాలన్నారు. మొదటి రోజు వివిధ కారణాల మూలంగా ఎవరైనా మిగిలి ఉంటే రెండో రోజు ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. డీఆర్‌డీఏ పీడీ సాయినాథ జై చంద్ర గాంధీ, ఎంపీడీవో ఉండ్రు బాబ్జి రాజు, డీపీఎం అన్నపూర్ణ సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.