
యాప్‌సోపాలు!
● పనిచేయని కొత్త యాప్‌తో ఇసుక కష్టాలు ● ఎగుమతులు జరగక నిలిచిన వాహనాలు ● కొత్త డ్యూటీలు మాకొద్దు అంటున్న ఉద్యోగులు
పెరవలి: ఇసుకాసురులకు ఇచ్చిన అవకాశాలు ఇచ్చినంత సేపు ఇచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేయటంతో ఇసుక ఎగుమతులు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరుకు మైనింగ్ అధికారులు ఇసుక కోసం వచ్చే వాహనాలను ముందుగా ఫొటో తీసి, దాని ప్రకారం ఇసుక బుక్ చేసుకున్న రశీదును ముందుగా వీఆర్‌ఓ లాగిన్‌లోకి వెళ్లి... వచ్చిన సమయం నోట్ చేసిన తరువాత కాంట్రాక్టర్ లాగిన్‌కు వస్తోంది. ఆ తరువాత కాంట్రాక్టర్ ఇసుక లోడ్‌కి అనుమతి ఇచ్చి, లోడ్ అయిన తరువాత మళ్లీ దానిని ఫొటో తీసి పంపిన తరువాత ఉన్నతాధికారులు ఓకే చేశాక, రశీదు రాసి వాహనదారుడుకి ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎవరైనా పొరపాటున తప్పుగా నమోదు చేస్తే సైట్ మొత్తం ఆగిపోతుంది. మళ్లీ సైట్ ఓపెన్ అవ్వాలంటే మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చి, అక్కడ నుంచి జిల్లా అధికారులకు, అక్కడ నుంచి అమరావతికి పంపించి జరిగిన తప్పు ఇది అని వీరందరికి చెప్పిన తరువాత దానిని సరిచేస్తే మళ్లీ సైట్ ఓపెన్ అవుతోంది. ఇదే క్రమంలో నిన్న ఆదివారం కాకరపర్రు ఇసుక ర్యాంప్, నేడు సోమవారం తీపర్రు ర్యాంప్‌లో ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి. కొత్త యాప్‌తో చాలా ఇబ్బందులు పడవలసి వస్తున్నదని దీనివలన ఎగుమతులు జరగక నానా పాట్లు పడుతున్నామని నిర్వాహకుల చెబుతుండగా, వాహనదారులు మాకు అసలు ట్రిప్‌లు పడటం లేదని, అన్ని సక్రమంగా ఉంటే యాప్ పనిచేయదని, యాప్ పనిచేస్తే ఇసుక ఉండటం లేదని అంటున్నారు. గతంలో రోజుకి మూడు ట్రిప్‌లు వేస్తే నాలుగు రోజులుగా కేవలం రెండు ట్రిప్‌లు మాత్రమే వేశామని చెప్పారు. దీంతో కిస్తీలు కట్టలేక, నానా ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ప్రభుత్వం అంతా అయిపోయిన తరువాత ఈ విధమైన నిర్ణయాలు చేయటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీఆర్‌ఓలు మాత్రం మాకు ఈ డ్యూటీలు వద్దని కోరుతున్నారు. ఒక వీఆర్‌ఓ నేరుగా కలెక్టర్‌కు నాకు ఇంగ్లిషు రాదు, నేను యాప్‌లో నమోదు చేయలేకపోతున్నానని తెలియజేయగా.. జిల్లా అధికారులు సచివాలయ సిబ్బందిని కొత్తగా నియమించటంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఉంది కానీ ఈ యాప్‌లు వలన ఎటువంటి ప్రయోజనం లేదని, దోచుకోవలసింది అంతా దోచేశారని ఇప్పుడు కొత్తగా నిబంధనలు తెచ్చి ఏమిటి ప్రయోజనం అని పలువురు అంటున్నారు. ఈ కొత్త యాప్ వలన ఎగుమతులు సక్రమంగా జరగక వాహనదారులు, ఇసుక వెళ్లక కాంట్రాక్టర్లు, కొత్త యాప్‌తో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

యాప్‌సోపాలు!