
‘వేదాంత’ తీరుపై ఎస్.యానాంలో నిరసన
ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానాంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వేదాంత రవ్వ ఆయిల్ ప్లాంట్ మూడు గేట్లను మూసివేసి మంగళవారం నిరసన తెలిపారు. ఉద్యోగులను ప్లాంట్ లోపలకు వెళ్లకుండా అడ్డుకుని ధర్నా నిర్వహించారు. గ్రామ ప్రజలపై వేదాంత అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతంలో అనేక సందర్భాలలో హామీలు ఇచ్చి అమలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దీంతో వేదాంత పర్యవేక్షణ అధికారి సతీష్ రెడ్డి.. ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఆర్డీవో మాధవీలతో ఫోన్‌లో మాట్లాడి, ఈ నెల 25వ తేదీన అమలాపురం ఎమ్మెల్యే, కలెక్టర్ సమక్షంలో వేదాంత ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో గ్రామస్తులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగిన ఆందోళనను అధికారుల హామీ అనంతరం తాత్కాలికంగా విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్ జోగి రాజేశ్వరి రాజా, ఎంపీటీసీ సభ్యులు పెట్టా అప్పారావు, పీడీఏయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, గ్రామ పెద్దలు దంగేటి చిట్టిబాబు, లంకే భీమరాజు, ఉలిశెట్టి దొరబాబు, పలచోళ్ల బుజ్జి పాల్గొన్నారు.
ప్లాంట్ కార్యకలాపాలను
అడ్డుకున్న గ్రామస్తులు
అధికారుల హామీతో
తాత్కాలికంగా విరమణ