
జిల్లా ఆర్య వైశ్య సంఘం నియామకాన్ని గుర్తించం
22 మండలాల వైశ్య సంఘం ప్రతినిధుల
స్పష్టీకరణ
అమలాపురం టౌన్: జిల్లాల పునర్విభజన జరిగాక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆర్య వైశ్య మహాసభను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర మహాసభ బైలాకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీకి తెలియకుండా నిర్ణయం తీసుకోవడం తగదని జిల్లాలోని 22 మండలాల ఆర్య వైశ్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు స్పష్టం చేశారు. అమలాపురంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఫంక్షన్ హాలులో మంగళవారం జరిగిన 22 మండలాల సంఘం ప్రతినిధుల సమావేశం రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ తీరును తీవ్రంగా ఖండించింది. జిల్లా ఆర్య వైశ్య మహాసభ ప్రతినిధి వరదా సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా మహాసభ గౌరవాధ్యక్షుడు ప్రగళ్లపాటి కనకరాజు, అధ్యక్షుడు కంచర్ల బాబి, రాష్ట్ర మహాసభ మాజీ కార్యదర్శి కొల్లూరి చినబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు యోండూరి సీతా మహాలక్ష్మి ప్రసంగించారు. రాష్ట్ర మహాసభ బైలాను కాదని ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కోనసీమ జిల్లాలకు కొత్త కార్యవర్గాన్ని నియమించామని స్మార్ట్ ఫోన్ల వాట్సాప్‌ల్లో పంపిస్తే సరిపోతుందా...అని వారు ప్రశ్నించారు. ఈ నెల 3న కాకినాడలో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్న సభను తాము బాయ్‌కాట్ చేస్తున్నట్లు సమావేశం ప్రకటించింది. కోనసీమ జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేసి, ఉమ్మడి జిల్లా మహాసభతో చర్చించి కొత్త కార్యవర్గాన్ని నియమించాలని సమావేశం డిమాండ్ చేసింది.
విడదీస్తే ఆమరణ దీక్షకు దిగుతా
మహాసభ (సంఘాన్ని)ను విడదీస్తే తాను ఆమరణ దీక్షకు దిగుతానని మహాసభ జిల్లా ప్రతినిది వరదా సూరిబాబు ప్రకటించారు. పలు మండలాల వైశ్య సంఘాల ప్రతినిధులు కుసుమంచి పాపారావు, కంచర్ల కృష్ణమోహన్, పళ్లపోతు బంగారం, కాళ్లకూరి కిరణ్, నంబూరి నరేష్, శింగంశెట్టి కుమార్ ప్రసంగించారు.