
కాలేజీ విద్యార్థుల మోటార్ బైక్‌లు 20 సీజ్
అమలాపురం రూరల్: మండలంలోని భట్లపాలెంలో బీవీసీ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద రవాణాశాఖ అధికారులు గురువారం జరిపిన తనిఖీలలో డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా, హెల్మెట్ ధరించకుండా, ట్రిపుల్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న విద్యార్థుల 20 మోటార్ బైక్‌లను సీజ్ చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని బైక్ మీద కాలేజీకి వచ్చే ప్రతి విద్యార్థి విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సూచించారు. రహదారి భద్రత విషయంలో ఉపేక్షించేది లేదని, అవసరమైతే తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు. ఈ విషయంలో కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు ముఖ్య బాధ్యత తీసుకోవాలని కోరారు. వాహనాలు సీజ్ చేసిన కాలేజీ విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు జ్యోతి, సురేష్, కాశీ విశ్వేశ్వరరావు, కౌశిక్ పాల్గొన్నారు.