
ఏమీ బాగోలేదు స్వామీ..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం.. భక్తులకు అందిస్తున్న సేవలకు సంబంధించి మూడో నెల అభిప్రాయ సేకరణలో కూడా మెరుగుదల కనిపించలేదు. గత ఫిబ్రవరిలో చిట్టచివరి ఏడో ర్యాంకు, మార్చిలో రెండో ర్యాంకు సాధించినా అసంతృప్తి అలాగే ఉంది. తాజాగా ఏప్రిల్ నాలుగో తేదీన విడుదల చేసిన గణాంకాల ప్రకారం భక్తుల అసంతృప్తి ఇంకా పెరిగినట్టు తెలుస్తోంది.
అభిప్రాయాల సేకరణ
దేవస్థానాల్లో అందే సేవలు, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ యాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా భక్తుల అభిప్రాయాలు తెలుసుకుంది. వాటిని ప్రామాణికంగా తీసుకుని తాజా ర్యాంకులు ప్రకటించింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరస్వామి, ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల, విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి, సింహాచలం వరాహ నృశింహస్వామి, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానాలకు సంబంధించి మార్చి 20 – ఏప్రిల్ నాలుగో తేదీల మధ్య సేకరించిన అభిప్రాయాల ప్రకారం మంగళవారం ర్యాంకులు విడుదల చేసింది.
దర్శనంలో రెండు
సత్యదేవుని దర్శనం మీరు అనుకున్న సమయంలో జరిగిందా అనే ప్రశ్నకు 69 శాతం మంది భక్తులు అవునని సమాధానం చెప్పగా, 31 శాతం మంది కాలేదన్నారు. సింహాచలం, శ్రీకాళహస్తి దేవస్థానాలకు కూడా ఇదే విధంగా రెండో ర్యాంకు వచ్చింది.
మౌలిక వసతుల్లో ఆరు
దేవస్థానంలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, వాష్ రూమ్స్, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు భద్రపరిచే చోటు, తదితర విషయాలపై 60 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. 40 శాతం మందికి మాత్రం నచ్చలేదు. ఈ విభాగంలో అన్నవరానికి ఆరో ర్యాంకు వచ్చింది.
ప్రసాదానికి రెండు
సత్యదేవుని ప్రసాదం రుచి, నాణ్యత విషయాలలో 80 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా 20 మంది అసంతృప్తి చెందారు. దీనిలో రెండో ర్యాంకు వచ్చింది.
పెరిగిన అసంతృప్తి
గతంలో జరిగిన అభిప్రాయ సేకరణలో స్వామివారి దర్శనంపై 70 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, ఈసారి అది 69 శాతానికి పడిపోయింది. మౌలిక వసతుల విషయంలో గతంలో 65 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, ఈసారి 60 శాతం మంది మాత్ర మే బాగున్నాయన్నారు. ప్రసాదం రుచి, నాణ్యతపై గతంలో 82.4 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా ఈసారి 80 శాతానికి పరిమితమైంది.
అన్నవరంలోని
సత్యనారాయణస్వామి
దేవస్థానం
రత్నగిరి సేవలపై భక్తుల అసంతృప్తి
అభిప్రాయ సేకరణలో వెల్లడి
వరుసగా మూడో నెలా అదే ఫలితం
కనిపించని మెరుగుదల