
13న ఉగాది జాతీయ కవి సమ్మేళనం
అమలాపురం టౌన్: శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన అమలాపురంలో 147వ జాతీయ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ వేదిక అంతర్జాతీయ సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ వెల్లడించారు. స్థానిక కూచిమంచి అగ్రహారంలోని సాయి సంజీవిని ఆస్పత్రి ఆడిటోరియంలో గురువారం జరిగిన జిల్లా శ్రీశ్రీ కళా వేదిక ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా వేదిక ప్రతినిధులతో పాటు పలువురు కవులు, సాహితీవేత్తలు, రచయితలు, కళాకారులు పాల్గొని శ్రీ కళా గ్రాండ్ రెసిడెన్సీలో నిర్వహించే జాతీయ కవి సమ్మేళనం నిర్వహణపై చర్చించారు. సమావేశంలో ఉగాది జాతీయ కవి సమ్మేళనం బ్రోచర్లను వేదిక ప్రతనిధులు విడుదల చేశారు. శ్రీశ్రీ కళా వేదిక జిల్లా కన్వీనర్లు నల్లా నరసింహమూర్తి, బీవీవీ సత్యనారాయణ, జాతీయ కమిటీ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణ, కడలి సత్యనారాయణ పాల్గొన్నారు.