
నేటి నుంచి ఇంటర్ తరగతులు
● రెండు నెలల ముందు నుంచే..
● డీఐఈవో సోమశేఖరరావు
అమలాపురం టౌన్: గతంలో ఇంటర్మీడియెట్ విద్యా సంవత్సరం జూన్ 1వ తేదీన మొదలయ్యేది. అయితే ఈసారి రెండు నెలల ముందే అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఇంటర్మీడియెట్ తరగతులు ప్రారంభమవుతున్నాయని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. ఇంటర్మీయెట్ బోర్డు తీసుకున్న సరికొత్త నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో మంగళవారం నుంచి ఇంటర్ తరగతులు మొదలవ్వాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశిలిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అమలాపురంలో డీఐఈవో ఈ విషయాన్ని సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కళాశాలల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతుల నిర్వహణ ఉంటుందన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తాత్కాలిక అడ్మిషన్లు ప్రారంభమవుతాయని వివరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకూ వేసవి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. జూన్ 2వ తేదీ నుంచి కళాశాలల పునః ప్రారంభం ఉంటుందని వివరించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గల డీఐఈవో కార్యాలయంలోని స్టోరేజ్ పాయింట్‌కు ఇప్పటికే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, ఇంగ్లిషు పాఠ్య పుస్తకాలు చేరుకున్నాయని తెలిపారు. అమలాపురం స్టోరేజ్ పాయింట్ నుంచి జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి మొదలైందని సోమశేఖరరావు వెల్లడించారు. ఒక్కో విద్యార్థికి ఆరు రూల్స్ పుస్తకాలు, ఆరు తెల్ల కాగితాల నోట్ పుస్తకాలు ఇస్తామన్నారు. డీఐఈవోతోపాటు సెకండరీ విద్య జిల్లా కమ్యూనికేషన్ మొబలైజేషన్ ఆఫీసర్ (సీఎంవో) బొరుసు వీర వెంకట సుబ్రహ్మణ్యం ఈ పుస్తకాల పంపిణీని పర్యవేక్షించారు.