
జిల్లాలో ఐదు సెమీ మెకనైజ్డ్ రీచ్‌లు
● పర్యావరణ అనుమతులు మంజూరు
● కార్యాచరణ రూపకల్పనకు
అధికారులకు ఆదేశం
● 17న టెండర్ల ఆహ్వానం, 22న ఖరారు
● జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్
అమలాపురం రూరల్: జిల్లాలో ఐదు సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశానికి కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా త్వరలో ఇసుక తవ్వకాల నిర్వహణకు టెండర్లు ఖరారు చేసి, ఈ నెల 30 నాటికి తవ్వకాలు చేపట్టాలన్నారు. స్టాక్ యార్డులకు ఇసుకను తరలించి, నిల్వ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. వర్షా కాలంలో భవన నిర్మాణ రంగ అవసరాలకు సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ యార్డ్‌లో నిల్వ చేయనున్నట్టు తెలిపారు. సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్‌ల నిర్వహణ కోసం కనీసం ఐదు పొరుగు జిల్లాల విధివిధానాలపై అధ్యయనం చేసి, ఈ నెల 16 నాటికి కార్యాచరణ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్‌కు సూచించారు. ప్రస్తుతం ఉన్న టాస్క్‌ఫోర్స్ బృందాలను బలోపేతం చేస్తూ, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నిరోధించాలని ఆదేశించారు. సెమీ మెకనైజ్డ్ రీచ్‌ల కమిటీలో సభ్యులుగా ఉన్న డ్వామా పీడీ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, జల వనరుల శాఖ ఇంజినీర్, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా ఆడిటర్లు ఈ రీచ్‌ల నిర్వహణ నిష్పక్షపాతంగా ఉండేలా విధివిధానాలు రూపొందించాలన్నారు. ఈ నెల 17న టెండర్లు పిలిచి, 22న ఖరారు చేస్తామని తెలిపారు. ఈ ఐదు సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచుల్లో సుమారు 21 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను గుర్తించినట్లు చెప్పారు. కొత్తపేట, రావులపాలెం, కపిలేశ్వరపురం, అమలాపురంల్లో స్టాక్ యార్డులు ఏర్పాటు చేశారన్నారు.
రెట్టింపు నిల్వలు
గతేడాది కేవలం వర్షాకాలం సీజన్‌లో 6.25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వ చేశారని, విస్తరిస్తున్న భవన నిర్మాణ రంగాన్ని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని రెట్టింపు చేస్తూ 13 లక్షల నుంచి 14 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక నిల్వలు ఉండేలా కార్యాచరణ సిద్ధం చేశామని వివరించారు. రావులపాలెం జాతీయ రహదారి–16కు దగ్గరగా 8 లక్షలు, అమలాపురం స్టాక్ యార్డ్‌లో 3 లక్షలు, తూర్పు డెల్టా గౌతమి ప్రాంతంలో 3 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వలు చేయనున్నట్లు తెలిపారు. స్టాక్ యార్డుల నిర్వహణపై అధ్యయనం చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. ప్రతిరోజు సుమారు 15 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ యార్డులకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం స్టాక్ యార్డుల్లో కేవలం 1.92 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వలున్నాయని తెలిపారు. సమావేశంలో జేసీ టి.నిషాంతి, ఆర్డీవోలు పి.శ్రీకర్, కె.మాధవి, డి.అఖిల, భూగర్భ గనుల శాఖ ఏడీ ఎల్.వంశీధర్‌రెడ్డి, గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ కాశీవిశ్వేశ్వరరావు, ఆర్టీవో డి.శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ పద్మనాభం, జీఎస్‌డబ్ల్యూఎస్ కో–ఆర్డినేటర్ సువిజయ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.రాము తదితరులు పాల్గొన్నారు.
క్లిష్ట సమస్యలపై నివేదికలు ఇవ్వాలి
అమలాపురం రూరల్: ప్రతి మండలంలో భూ పరిపాలన సాధారణ ఏడు అంశాలపై కాకుండా, క్లిష్ట సమస్యలపై నివేదికలు రూపొందించి తమకు సమర్పించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ బదిలీ, భూముల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ భూములు పేదలకు పంపిణీ, ఈనాం భూములు, ఆర్‌ఓఆర్ వెబ్‌ల్యాండ్, రీసర్వే 22ఏ భూముల క్రమబద్ధీకరణ కాకుండా, సుదీర్ఘకాలంగా పరిష్కరించలేని క్లిష్ట సమస్యలను మాత్రమే సమర్పించాలని సూచించారు. నీటి తీరువా పూర్తి స్థాయిలో వసూలు చేయాలని ఆదేశించారు. జేసీ టి.నిశాంతి మాట్లాడుతూ, ప్రతి మండలంలో భూ బదిలీ, క్రమబద్ధీకరణ తదితర నెలవారీ నివేదికలను ఆర్డీఓలకు సమర్పించాలని ఆదేశించారు. ఇలాఉండగా గ్రామాల్లో అసైన్డ్ భూముల్లో మూడేళ్ల వరకు కట్టడాలు లేకపోతే వాటిని ప్రభుత్వ అవసరాలకు తిరిగి తీసుకోవాలని సూచించారు. భూముల క్రమబద్ధీకరణ పథకానికి ఈ ఏడాది డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకుని హక్కులు పొందాలన్నారు. అభ్యంతరాల్లేని ప్రభుత్వ భూముల్లో గృహాలు, నివాస స్థలాలు కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్డీఓలు కె.మాధవి, డి.అఖిల, పి.శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.