
79 వేల కుటుంబాలకు సూర్యఘర్
కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా జిల్లాలో 79 వేల షెడ్యూల్ కులాల కుటుంబాలకు ఏపీ ట్రాన్స్‌కో, బ్యాంకర్ల సమన్వయంతో రానున్న మూడు నెలల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ట్రాన్స్‌కో అధికారులు, బ్యాంకర్లతో సమావేశమై జిల్లాలో ఇప్పటి వరకు సూర్యఘర్ పథకానికి అర్హుల జాబితాను సమీక్షించారు. జిల్లాలో 200 లోపు యూనిట్ల విద్యుత్ వాడకం ఉన్న 79 వేల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని వీరిలో 23 వేల కుటుంబాలకు సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు రూఫ్‌టాప్‌లు ఉన్నాయని, మిగిలిన వారికి ప్రభుత్వ నోటిఫైడ్ స్థలాలలో సూర్య ఘర్ విద్యుత్ సరఫరా ప్లాం ట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కిలోవాట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.30వేలు సబ్సిడీ రూపంలో అందించగా మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. రెండు కిలోవాట్ల వినియోగం ఉన్నవారు కేంద్ర ప్రభు త్వం నుంచి రూ.60 వేల వరకు సబ్సిడీ పొంద వచ్చునని మిగిలిన సొమ్ము బ్యాంకు రుణంగా అందిస్తుందన్నారు. అయితే లబ్ధిదారుడు రెండు కిలోవాట్లకు అయ్యే ఖర్చు రూ.1.50 లక్షల్లో 10 శాతం రూ.15 వేలు వాటాగా ముందుగా చెల్లించాలన్నారు. మిగిలిన సొమ్మును ఏడు శాతం వడ్డీతో బ్యాంకు రుణంగా మంజూరు చేస్తుందన్నారు. అదేవిధంగా మూడు కిలోవాట్లు ఏర్పాటు చేసుకునే లబ్ధిదారులకు కేంద్రం రూ.78 వేలు రాయితీని ఇస్తుందన్నారు. యూనిట్ ఏర్పాటు చేసిన అనంతరం వినియోగ దారుడు వాడకం పోను మల్టీ మీటర్ ద్వారా మిగిలిన యూనిట్లు గ్రిడ్డుకు జనరేట్ అవుతాయని ఒక్కొక్క యూనిట్కు రెండు రూపాయలు చొప్పున తిరిగి విని యోగదారులకు చెల్లించే వెసులుబాటు ఉందన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎస్.రాజబాబు, ఎల్‌డీఎం కేశవ వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు
విపత్తుల నిర్వహణ దళాలు సూచనల మేరకు ఈ ఏడాది గత ఏడాది కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నాయని, వడదెబ్బ బారి నుంచి రక్షణ పొందేందుకు ఆయా శాఖలు చేపడుతున్న చర్యలపై నివేదికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఈ మేరకు అధికారులతో సమీక్షించారు. ఉపాధి పుణ్యక్షేత్రాలలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రకారం తాగునీరు, మజ్జిగ ఏర్పాటుతో పాటు పని వేళలను మారుస్తూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల మధ్య ఎటువంటి పనులు నిర్వహించకుండా చూడాలన్నారు. అదేవిధంగా పాఠశాలల సమయాలు మార్చాలని, వ్యవసాయ క్షేత్రాలలో యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు.