
జిల్లాలో 404 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రామచంద్రపురం: రానున్న రబీ సీజన్‌కు జిల్లాలో 404 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ బాల సరస్వతి వెల్లడించారు. జేసీ టి.నిశాంతి అదేశాల మేరకు డివిజన్ పరిధిలో గల సిబ్బందికి ధాన్యం సేకరణ సమయంలో శాంపిల్స్, వాటి విశ్లేషణ, పాటించాల్సిన ప్రమాణాలు, తేమ శాతం, వ్యర్థాలు శాతం తదితర అంశాలపై స్థానిక వీఎస్‌ఎం కళాశాలలో శుక్రవారం అవగాహన కల్పించారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరిస్తున్నట్టు తెలిపారు. సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,300, గ్రేడ్ ఏ రకం ధాన్యానికి రూ.2,320కు కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. ఎటువంటి సందేహాలు ఉన్నా రైతులు జిల్లా కంట్రోల్ రూమ్ నెంబరు 83094 32487, 94416 92275 నంబర్లను ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు నేరుగా సంప్రదించవచ్చునని తెలిపారు.
ఐదంచెల విద్యా విధానానికి చర్యలు
అమలాపురం రూరల్: విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని, ఆ దిశగా ఐదు అంచెల విద్యా వ్యవస్థల ఏర్పాటుకు సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులను ఒప్పించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఎంఈఓలను ఆదేశించారు. శుక్రవారం ఐదు రకాల బడుల ఏర్పాటుకు చేపట్టిన సర్వేపై ఎంఈఓలతో సమీక్షించారు. ఈ విధానంలో అన్ని సౌకర్యాలతో పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడేలా ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. దీనికి కోసం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ, స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధుల సర్వే ద్వారా అంగీకారం పొందాలన్నారు.