
మహిళల రక్షణకు వన్ స్టాప్ సెంటర్
అమలాపురం రూరల్: వేధింపులు, వివక్ష నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు వన్ స్టాప్ సెంటర్ అన్ని విధాలా ఉపయోగపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కలెక్టరేట్‌లో ఇటీవల ఈ సెంటర్ ఏర్పాటు చేశారు. దీని నిర్వహణకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 13 పోస్టులు నింపేందుకు గురువారం ఆమె ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ఈ సెంటర్‌లో నియమించే సిబ్బంది ప్రధానంగా గృహహింస, పని చేసే ప్రాంతాల్లో మహిళలపై వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారన్నారు. జిల్లా స్థాయిలో ఐసీడీఎస్ పీడీ, సీడీపీఓ, ఇతర అధికారుల ఆధ్వర్యాన ఈ కార్యక్రమం అమలు చేస్తారన్నారు. ఇంటర్వ్యూల్లో కమిటీ సభ్యులు ఐసీడీఎస్ పీడీ శాంతికుమారి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఎం.దుర్గారావుదొర, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి, సీడీపీఓలు పాల్గొన్నారు.
మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాలి
జిల్లావ్యాప్తంగా రబీలో 5.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని, ఇందులో ప్రభుత్వ పరంగా కొనుగోలుకు నిర్దేశించిన 34 శాతం లక్ష్యం సరిపోలేదని, అందువలన బహిరంగ మార్కెట్‌లో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాలని జేసీ నిషాంతి కోరారు. రైస్ మిల్లర్ల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని రాష్ట్ర స్థాయి అధికారులకు విన్నవించామని అన్నారు. మిల్లర్ల ప్రతినిధులు కూడా ఈ మేరకు కోరాలని అన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం.బాలసరస్వతి, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చౌదరి తదితరులు పాల్గొన్నారు.