విమానాశ్రయం కాదు.. రైల్వే లైన్‌ సంగతి చూడండి | - | Sakshi
Sakshi News home page

విమానాశ్రయం కాదు.. రైల్వే లైన్‌ సంగతి చూడండి

Published Fri, May 2 2025 12:19 AM | Last Updated on Fri, May 2 2025 12:19 AM

విమానాశ్రయం కాదు..  రైల్వే లైన్‌ సంగతి చూడండి

విమానాశ్రయం కాదు.. రైల్వే లైన్‌ సంగతి చూడండి

వైఎస్సార్‌ సీపీ ఐటీ విభాగం

జిల్లా అధ్యక్షుడు గౌతమ్‌రాజా

అమలాపరం టౌన్‌: కోనసీమకు త్వరలో విమానాశ్రయం కూడా రానున్నదని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌ సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తోరం గౌతమ్‌రాజా గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. కోనసీమకు ఇప్పుడు కావాల్సింది విమానాశ్రయం కాదని, ఏళ్ల తరబడి నత్తనడక నడుస్తున్న కోనసీమ రైల్వే లైన్‌ నిర్మాణం అత్యవసరంగా పూర్తి చేయడమని స్పష్టం చేశారు. రైల్వే లైన్‌కు అవసరమైన భూసేకరణలో నెలకొన్న అడ్డంకులను తొలగించేలా ఎంపీ, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైల్వే లైన్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో చెప్పకుండా అదిగో ఇదిగో అంటూ విమానాశ్రయం గురించి మాట్లాడడం అసందర్భంగా ఉందని పేర్కొన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కోనసీమకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసి, దాదాపు 30 శాతం పనులు పూర్తి చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కళాశాల పనులను నిలిపేసిందన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని గౌతమ్‌రాజా విజ్ఞప్తి చేశారు.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌

జోడీకి అభినందనలు

అమలాపురం టౌన్‌: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి అత్యుత్తమ క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు అందుకోవడం పట్ల కోనసీమకు చెందిన పలువురు అభినందించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి చేతుల మీదుగా వారు ఢిల్లీలో గురువారం అవార్డు అందుకోవడంపై కోనసీమ షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అల్లాడ శరత్‌బాబు, కార్యదర్శి తిక్కిరెడ్డి సురేష్‌ హర్షం వ్యక్తం చేశారు. అమలాపురానికి చెందిన సాత్విక్‌ ధ్యాన్‌చంద్‌ అవార్డుకు ఎంపికై నప్పుడు ఆయన తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్‌ ఎంతో సంతోషించారు. కాశీ విశ్వనాథ్‌ ఇటీవల మృతి చెందడంతో ఈ అవార్డు స్వీకరణలో కొంత జాప్యం అనివార్యమైంది. సాత్విక్‌ తన తల్లి రంగమణితో కలిసి వెళ్లి అవార్డు అందుకున్నారని శరత్‌బాబు తెలిపారు.

బాలికల భవితకు

కిశోరి వికాసం

కాకినాడ సిటీ: బాలికల రక్షణ, వారి అభివృద్ధి కిశోరి వికాసం కార్యక్రమ ముఖ్య లక్ష్యాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి అన్నారు. ఈ కార్యక్రమం పోస్టర్‌ను కలెక్టరేట్‌లో గురువారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కింద జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన వార్డు, గ్రామ సచివాలయాల్లో ఈ నెల 2 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకూ బాలికలకు 12 అంశాలపై అవగాహన కల్పించనున్నారని చెప్పారు. 11 నుంచి 18 సంవత్సరాల లోపు బాలికలను, డ్రాపౌట్లను గుర్తించి, గ్రూపులుగా తయారు చేసి, శిక్షణ ఇవ్వనున్నారన్నారు. రుతుక్రమ పరిశుభ్రత, నిర్వహణ, లైంగిక విద్య, బాల్యవివాహం, పునరుత్పత్తి, ఆరోగ్యం, బాలల హక్కులు, రక్షణ, పోక్సో చట్టం, కౌమార దశలో ఐరన్‌ లోపం, రక్తహీనత, లింగ అసమానత, విద్య, కెరీర్‌, మార్గదర్శకత్వం, నైపుణ్యాల ప్రాధాన్యం, సైబర్‌ మోసాలు, ఆన్‌లైన్‌ భద్రత, సమస్యలు, ఆర్థిక నిర్వహణ, కౌమార బాలికల నాయకత్వం, సాధికారిత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేశామని వివరించారు.

కేఎస్‌పీఎల్‌ భూములకు

పరిహారం పెంచాలి

తొండంగి: కాకినాడ సీపోర్టు లిమిటెడ్‌(కేఎస్‌పీఎల్‌)కు తొండంగి మండలం పెరుమాళ్లపురంలో ప్రభుత్వం సేకరించిన భూములకు పరిహారాన్ని మరింత పెంచాలని రైతులు కోరారు. ఈ భూముల పరిహారంపై రైతులతో తొండంగి తహసీల్దార్‌ కార్యాలయంలో జేసీ రాహుల్‌ మీనా చర్చించారు. మొత్తం సుమారు 597 ఎకరాల భూములకు సంబంధించి ప్రభుత్వం ఎకరాకు రూ.10 లక్షలు ప్రకటించిందని తహసీల్దార్‌ మురార్జీ వివరించారు. ఈ మొత్తానికి అంగీకరించని 781 మంది రైతులు పరిహారం తీసుకోలేదు. ఈ భూములకు మార్కెట్లో ఎక్కువ ధర ఉందని, రెట్టింపు పరిహారం ఇవ్వాలని 52 మంది రైతులు డిమాండ్‌ చేశారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి, రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని జేసీ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement