తూర్పు గోదావరి: బ్రాయిలర్ కోడి ధర కొండెక్కి కూర్చుంది. రికార్డు స్థాయిలో రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో మాంసాహార ప్రియులు ధరలు చూసి బెంబేలెత్తి పోతున్నారు. ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహారులకు పెరిగిన ధర మింగుడుపడటం లేదు. సాధారణంగా ప్రతి రోజూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 400 టన్నుల బ్రాయిలర్, లేయర్ కోళ్ల సరఫరా జరగుతుంది. కోళ్ల ఉత్పత్తి మందగించడంతో ఏర్పడిన కొరత దృష్ట్యా వారం రోజుల నుంచి తుని, రాజమహేంద్రవరం తణుకులోనున్న కోళ్ల ఉత్పత్తి కంపెనీలు, రైతుల నుంచి కేవలం 250 టన్నుల వరకూ మాత్రమే సరఫరా జరగుతోంది.
వేసవి ప్రభావం దృష్ట్యా కోళ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో పాటు ఎండ తీవ్రతను తట్టుకోలేక అనునిత్యం వేలాది కోళ్లు మృత్యువాత పడటం ఈ ధరలు పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. మూడు నెలల నుంచి చికెన్ ధరలు రూ.100 లోపే ఉండటంతో నష్టాలు తట్టుకోలేని రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. దీంతోపాటు వేసవి ప్రభావాన్ని ముందే ఊహించిన కొంతమంది కోళ్ల పెంపకాన్ని తగ్గించడంతో ఉత్పత్తి మందగించింది. కంపెనీల నుంచి స్థానిక హోల్‌సేల్ వ్యాపారులకు సరఫరా దారులు రూ.150 ధర నిర్ణయించగా, రిటైర్లకు రూ.165 వరకూ విక్రయిస్తున్నారు.
చికెన్ ధర పెరిగినా తగ్గని విక్రయాలు
బహిరంగ మార్కెట్లో బ్రాయిలర్ కోడి కేజీ హోల్‌సేల్ ధర రూ.170 కాగా చికెన్ కేజీ రూ.300, బోన్‌లెస్ రూ. 400 వరకూ విక్రయిస్తున్నారు. కోళ్ల కొత్త బ్యాచ్‌లు వచ్చే వరకూ మరో నెల రోజుల వరకూ ఇంచుమించు ఇదే ఇవే ధరలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం చికెన్ ధర ఆశాజనకంగా ఉండటంతో స్థానిక రైతులు వారం రోజుల నుంచి కోళ్ల ఫారంలో ఉన్న కోళ్లలో కేజీన్నర దాటిన వాటిని విక్రయించే పనిలో పడ్డారు.
ఇప్పుడు ఆ బ్రాయిలర్ కోళ్ల సరఫరా అంతంగా మాత్రంగానే ఉండటంతో చికెన్ ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. చికెన్ ధరలు పెరుగుతున్నా విక్రయాలు మాత్రం తగ్గడం లేదు. స్థానికంగా ఎండల నుంచి ఉపశమనాన్ని పొందే విధంగా చర్యలు తీసుకుని కోళ్ల పెంపకం సాగిస్తున్న చిన్నకారు రైతులకు మాత్రం ఈ ధర అమాంతం లాభాలు తెచ్చి పెడుతోంది.
ఉష్ణోగ్రతల ప్రభావంతోనే చికెన్ ధర పెరిగింది
వేసవి దృష్ట్యా రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల చికెన్ ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో వేడిమిని తట్టుకోలేక కోళ్ల ఫారాల్లో రోజూ సరాసరి వందలాది కోళ్లు మృతి చెందుతున్నాయి. పెరిగిన ధరలలోను రైతులు నష్టాలను చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ధరలు జూన్ నెలాఖరు వరకూ కొనసాగే అవకాశం ఉంది.
– బొబ్బా వెంకన్న, హోల్‌సేల్ కోళ్ల వ్యాపారి, పెదపళ్ల
Comments
Please login to add a commentAdd a comment