కాకినాడ: పట్టుకున్న దెయ్యాన్ని వదిలిస్తానంటూ భార్యను చెప్పుతో విచక్షణారహితంగా చితకబాదడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై బుధవారం రాజోలు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. రాజోలు ఎస్సై ఫృధ్వీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజోలు మండలం శివకోడు కందికట్టు వారి గ్రూపునకు చెందిన బళ్ల విజయ్‌కుమార్‌కు 2015లో అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన మనీషాతో వివాహమైంది.
వారికి మూడేళ్ల కిరిటీ సాయివర్థన్, ఏడాదిన్నర హర్ష ఉన్నారు. కొంత కాలంగా భార్యపై అనుమానంతో భర్త విజయ్‌కుమార్ చీటికిమాటికీ గొడవ పడుతున్నాడు. మనీషా తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లడంతో తరచూ డబ్బులు పంపించాలని వేధించేవాడు. ఈ పరిస్థితుల్లో గత నెల 28వ తేదీన మనీషాకు దెయ్యం పట్టుకుందని చెప్పుతో చితకబాది, మెడను తిప్పడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ స్థితిలో ఉన్న ఫొటోలను విజయ్‌కుమార్ మనీషా తండ్రి శ్రీనివాసరావుకు పంపించాడు. వెంటనే ఆయన తన కుమారుడు కార్తీక్‌తో శివకోడు వచ్చి మనీషాను వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు.
మెరుగైన వైద్యం కోసం గత నెల 31వ తేదీన అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే దెయ్యం పట్టుకోవడంతో అనారోగ్యానికి గురై, తన భార్య చనిపోయిందని నమ్మించి మృతదేహాన్ని తన ఇంటికి భర్త విజయ్‌కుమార్ తీసుకుని వచ్చాడు. కువైట్‌లో ఉన్న మనీషా తల్లి వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేయాలని మనీషా తండ్రి శ్రీనివాసరావు డిమాండ్ చేశాడు. కుమార్తె మృతి చెందిందన్న విషయం తెలియగానే తల్లి కువైట్ నుంచి బుధవారం శివకోడు వచ్చి తన కుమార్తె అనారోగ్యంతో చనిపోలేదని, దెయ్యం పట్టుకుందని అబద్ధాలతో తన అల్లుడే చంపేశాడని భోరున విలపించింది.
తన కుమార్తె మృతిపై విచారణ చేయాలని తండ్రి శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదు మేరకు రాజోలు ఎస్సై ఫృధ్వీ కేసు నమోదు చేశారు. పి.గన్నవరం సీఐ రజనీకుమార్ దర్యాప్తు చేపట్టారు. తహసీల్దారు బి.ఎం.ముక్తేశ్వరరావు ఘటనా స్థలంలో విచారణ నిర్వహించారు. మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టమ్‌కు తరలించామని, భర్త విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్సై ఫృధ్వీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment