కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తన స్వేచ్ఛకు అడ్డు పడుతోందన్న అక్కసుతో ఓ బాలిక.. తన ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి పెంపుడు తల్లిని హతమార్చిన సంఘటన రాజమహేంద్రవరంలో కలకలం రేపింది. సెంట్రల్ జోన్ డీఎస్పీ కె.విజయపాల్, త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం.ప్రసన్న వీరయ్యగౌడ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. నగరంలోని కంబాలపేటకు చెందిన హతురాలు సిద్ధాబత్తుల మార్గరెట్ జులియానా (63) ఉపాధ్యాయురాలిగా పని చేసి, రిటైరయింది.
భర్త నాగేశ్వరరావు ఎస్‌బీఐలో పని చేసేవాడు. ఏడాది క్రితం మృతి చెందాడు. ఆస్తులు బాగానే ఉన్నాయి. పిల్లలు లేకపోవడంతో 13 ఏళ్ల క్రితమే నెలల వయసున్న ఓ బాలికను దత్తత తీసుకున్నారు. భర్త మృతి చెందటంతో జులియానా పెంపుడు కుమార్తెతో కలసి ఉంటోంది. ఇటీవల ఆ బాలిక చెడు స్నేహాలు పట్టింది. కంబాలపేటకే చెందిన ఆకాష్ (19) అనే యువకుడితో ప్రేమలో పడింది. అతడితో ఫోన్‌లో మాట్లాడుతూండటంతో తల్లి మందలించేది. దీంతో ఆ బాలిక తల్లిపై కోపం పెంచుకుంది. ఆమె చనిపోతే ఆస్తులన్నీ తనకే చెందుతాయని భావించింది.
ప్రియుడు ఆకాష్‌తో కలిసి సమయం కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ సాయంత్రం జులియానా బాత్‌రూములో కాలు జారి పడింది. కాలికి గాయమవడంతో బంధువులందరికీ తెలిపింది. విషయం తెలియడంతో జులియానాను చంపేందుకు ఇదే మంచి సమయమని ఆకాష్ భావించి, పథక రచన చేశాడు. స్నేహితులు అక్షయకుమార్ (అయ్యప్ప నగర్), దాస్యం దినేష్‌రాయ్(ఆర్యాపురం)తో కలిసి అతడు జులియానా ఇంటికి అదే రోజు అర్ధరాత్రి చేరుకున్నారు. ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం.. ఆ బాలిక అప్పటికే సీసీ కెమెరాలను నిలిపివేసింది.
అందరూ కలిసి, నిద్రపోతున్న జులియానా కాళ్లు, చేతులు పట్టుకుని వస్త్రంతో ముఖంపై అదిమి ఊపిరి ఆడకుండా చేసి, హతమార్చారు. అనంతరం ఆకాష్, అతడి స్నేహితులు ఏమీ ఎరగనట్టుగా బయటకు వెళ్లిపోయారు. తన తల్లి అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందిందని ఆ బాలిక బంధువులకు ఫోన్ చేసి, సాధారణ మృతిగా నమ్మించేందుకు ప్రయత్నించింది.
పట్టుబడిందిలా..
అయితే, కుమార్తె ప్రవర్తన సరిగ్గా లేని విషయాన్ని జులియానా సీతానగరంలోని తన సోదరుడికి గతంలో పలుమార్లు చెప్పింది. ఈ నేపథ్యంలో అనుమానం రావడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డీఎస్పీ విజయపాల్, త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రసన్న వీరయ్య గౌడ్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. బాలిక పొంతన లేకుండా మాట్లాడటం, సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. లోతుగా విచారించగా ఆ బాలిక నేరాన్ని అంగీకరించింది. ఆమెతో పాటు మిగిలిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment