హైవేలపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. హైవే పోలీస్ స్టేషన్ల పరిధిలోని మోరంపూడి, పిడింగొయ్యి, జేఎన్ రోడ్డు, ఏవీ అప్పారావు రోడ్డు, లాలాచెరువు పాయింట్లను ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగాల ఇన్‌స్పెక్టర్లతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ప్రమాదాలు, నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమైన హైవే జంక్షన్లలో సీసీ కెమెరాలు, స్పీడ్ కంట్రోల్ ట్రాఫిక్ బోర్డులు, లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి భద్రతపై జిల్లావ్యాప్తంగా ప్రజలకు, విద్యార్థినీ విద్యార్థులకు ప్రతి రోజూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు అనుసూరి శ్రీనివాసరావు (స్పెషల్ బ్రాంచి), కాశీ విశ్వనాథ్ (బొమ్మూరు), జి.ఉమామహేశ్వరరావు (సోషల్ మీడియా అండ్ సైబర్ క్రైమ్), ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు నబీ, చింతా సూరిబాబు, ఎస్సై అయ్యప్పరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రాధాన్యం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేలా, రైతులు సొంతంగా చదువుకుని అవగాహన పొందేలా రూపొందించిన పుస్తకాలను తన చాంబర్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి సంక్షిప్త మార్గదర్శిని, రైతుల విజయగాథలు, పురుగు, తెగుళ్ల యాజమాన్య దీపిక, పెరటి తోటల పెంపకం, ఫార్మర్ ఫీల్డ్ స్కూల్, ప్రకృతి వ్యవసాయంలో మహిళా సంఘాల పాత్ర తదితర పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి తాతారావు తదితరులు పాల్గొన్నారు.
నేడు సత్య స్వాముల పడిపూజ
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం వద్ద శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు సత్య స్వాముల పడిపూజ నిర్వహించనున్నారు. సత్య దీక్షలు ఆచరించిన వేలాది మంది స్వాములు సత్యదేవుని జన్మనక్షత్రం మఖ సందర్భంగా శనివారం స్వామివారి సన్నిధిలో దీక్ష విరమించనున్నారు. ఈ దీక్షల విరమణకు ముందు రోజు సత్య స్వాములతో రత్నగిరిపై ఏటా పడిపూజ చేయడం ఆనవాయితీ. పూజలో పాల్గొనే భక్తులకు ఫలహారం ఏర్పాటు చేశారు. ఈ పూజలకు వెయ్యి మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు తెలిపారు. ఈఓ కె.రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు పడిపూజ ఏర్పాట్లను దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు, ఈఈ రామకృష్ణ, ఏఈఓ కొండలరావు, డీఈ రాంబాబు తదితరులు గురువారం పరిశీలించారు.
ఆ కాలేజీకి అనుమతుల్లేవు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సీతానగరం మండలం చినకొండేపూడిలోని సహస్ర కుందన కళాశాలకు ఎటువంటి అనుమతులూ లేవని ప్రాంతీయ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి ఎన్‌ఎస్‌ఎల్‌వీ నరసింహం గురువారం తెలిపారు. ఆ కళాశాలలో విద్యార్థులెవ్వరూ చేరవద్దని, దానిలో చదివిన వారిని ఇంటర్ బోర్డు పరీక్షలకు అనుమతించబోమని స్పష్టం చేశారు.
హైవేలపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
హైవేలపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
Comments
Please login to add a commentAdd a comment