స్క్రీనింగ్‌కు శ్రీకారం
●
● ఇంటి వద్దనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
● 14న ప్రారంభించిన వైద్య, ఆరోగ్య సిబ్బంది
● 18 సంవత్సరాలు నిండిన
ప్రతి ఒక్కరికీ పరీక్షలు
● తద్వారా వ్యాధి లక్షణాల గుర్తింపు
● నెలాఖరు వరకూ సర్వే
రాజమహేంద్రవరం రూరల్: జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ‘క్యాన్సర్‌పై విజయం.. స్క్రీనింగ్‌తో సాధ్యం’ అనే కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. దీని కోసం ఆ శాఖ సిబ్బంది ఈ నెల 14 నుంచి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) సర్వేతో పాటు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక యాప్ రూపొందించింది. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అధికారులు.. సర్వే జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వే ప్రకారం చాలా మంది క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఇది క్యాన్సర్ రోగుల మరణాలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రాథమిక దశలోనే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడం ద్వారా బాధితుల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ఈ సర్వే చేపట్టారు. ఆయుష్మాన్ భారత్ సమగ్ర ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా 8 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగించనున్నారు.
స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారిలా..
ఒక వ్యక్తిలో క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు చేసే పరీక్షలనే క్యాన్సర్ స్క్రీనింగ్ అని పిలుస్తున్నారు. క్యాన్సర్ ముందస్తు నిర్ధారణకు, నివారణకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. క్యాన్సర్ లక్షణాలు ప్రాథమిక స్థాయిలో గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ యాప్‌లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి బీపీ, సుగర్, రక్తహీనత, ఆహారపు అలవాట్లు తదితర అంశాలను నిక్షిప్తం చేస్తారు. జిల్లాలో 6,48,295 కుటుంబాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన వారు 15,10,336 మంది ఉన్నారు. వీరందరికీ 512 బృందాల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ బృందాల్లో ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ, ఆశా కార్యకర్తలు ఉంటారు. ప్రతి బృందం రోజుకు ఐదు ఇళ్లను సందర్శించి, అవసరమైన వివరాలు యాప్‌లో నమోదు చేస్తుంది. తద్వారా అవసరమైన వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.
2 శాతం పూర్తి
జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ రెండు శాతం పూర్తయింది. దీని ద్వారా క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా గుర్తించవచ్చు. ముఖ్యంగా మహిళలు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్లతో బాధ పడుతున్నారు. వారు ఈ పరీక్షల ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు.
– డాక్టర్ జి.హరిశ్చంద్ర,
ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్
శాటిలైట్ సిటీలో క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది
స్క్రీనింగ్‌కు శ్రీకారం
Comments
Please login to add a commentAdd a comment