వీక్షణతో విషయాసక్తి వృద్ధి
రాయవరం: తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను ప్రత్యక్షంగా చూడడం ద్వారా విద్యార్థులలో సంబంధిత అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. శాసీ్త్రయ పరిశోధన, ప్రయోగశాల, క్షేత్ర స్థాయి పర్యటనల ద్వారా ఆ అనుభవాన్ని పొందేందుకు ఉద్దేశించినదే ‘సైన్స్ ఎక్స్‌పోజర్ విజిట్’. వీటినే స్టడీ టూర్స్‌గా పిలుస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విజ్ఞానంతో కూడిన విహార యాత్రలకు సమగ్ర శిక్ష చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యార్థులకు క్షేత్ర స్థాయి పర్యటనలకు అవకాశం కల్పిస్తూ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేసి ఆ మేరకు నిధులు కేటాయించారు.
ప్రాథమిక, సెకండరీ పాఠశాలలకు
జిల్లాల వారీగా ప్రాథమిక పాఠశాలలు, సెకండరీ పాఠశాలల విద్యార్థులు విజ్ఞాన యాత్రలకు వెళ్లనున్నారు. 60కు పైగా విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల నుంచి ఒక్కో విద్యార్థిని ఎంపిక చేస్తారు. అలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 46, తూర్పుగోదావరి జిల్లా 113, కాకినాడ జిల్లా 168 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. సెకండరీ పాఠశాలల స్థాయిలో బాలురు, బాలికలు, పాఠశాల ఉపాధ్యాయులు, గైడ్ టీచర్లు, ఏఎంవోలు, డీఎస్‌వోలు ఈ విజ్ఞాన విహార యాత్రలకు వెళ్లనున్నారు. కాకినాడ జిల్లా నుంచి బాలురు 21, బాలికలు 42, ఉపాధ్యాయులు 21, గైడ్ టీచర్లు 20, తూర్పుగోదావరి నుంచి బాలురు 19, బాలికలు 38, టీచర్లు 19, గైడ్ టీచర్లు 18, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి బాలురు 44, బాలికలు 88, టీచర్లు 38, గైడ్ టీచర్లు 25 మందిని ఎంపిక చేశారు. అలాగే ఆయా జిల్లాల నుంచి సమగ్ర శిక్షా అకడమిక్ మానిటరింగ్ అధికారులు, జిల్లా సైన్స్ అధికారులు వీరితో యాత్రలకు వెళ్లనున్నారు.
కేటాయింపులు ఇలా
విజ్ఞాన యాత్రలకు వెళ్లే విద్యార్థులకు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఆయా జిల్లాలకు నిధులను కేటాయించారు. ప్రాథమిక స్థాయిలో జిల్లా స్థాయి పర్యటనకు ఒక్కో విద్యార్థికి రూ.200, రాష్ట్రేతర పర్యటనకు ఒక్కో విద్యార్థికి రూ.2వేలు కేటాయించారు. అలాగే సెకండరీ స్థాయి విద్యార్థులకు రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలకు పర్యటనకు వెళ్లే ఒక్కో విద్యార్థికి రూ.2 వేలు కేటాయించారు.
ఎంపిక చేసిన ప్రాంతాలు
రాష్ట్రం లోపల..
● శ్రీహరికోట (షార్), తిరుపతి
(సైన్స్ సెంటర్), చిత్తూరు(అగస్త్య),
విశాఖపట్నం (నేవల్ డాక్‌యార్డ్,
స్టీల్ ప్లాంట్, హెచ్‌పీసీఎల్).
ఇతర రాష్ట్రాలలో..
● వైటమ్, నెహ్రూ ప్లానిటోరియం
(బెంగుళూరు), బిర్లా ప్లానిటోరియం
(హైదరాబాదు), ఐఐఎస్‌ఈఆర్( పూనే),
గిండీ నేషనల్ పార్క్ మరియు
పెరియార్ సైన్స్ సెంటర్ (చైన్నె).
స్టడీ ట్రిప్ లక్ష్యాలివీ..
● సైన్స్, గణిత ప్రయోగాలు, ప్రదర్శనలను
విద్యార్థులకు ప్రయోగాత్మకంగా చూపించడం.
● సైన్స్ అండ్ టెక్నాలజీపై విద్యార్థుల్లో
ఉత్సుకత, ఆసక్తిని పెంచడం.
● విద్యార్థులు చూసి నేర్చుకోవడానికి
అనువుగా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం.
● సమస్యలను ఎదుర్కోవడం, సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనే నైపుణ్యాలను విద్యార్థుల్లో అభివృద్ధి చేయడం.
విధి విధానాలు ఇలా..
● విజ్ఞాన యాత్రలకు లక్ష్యానికి అనుగుణంగా
సందర్శించే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి.
● సదరన్, జిల్లా సైన్స్ ఫేర్‌లో విజేతలైన విద్యార్థులను పర్యటనలకు ఎంపిక చేసుకోవాలి.
● ప్రతి 10 మంది బాలికలకు ఒక మహిళా
టీచర్‌ను ఎస్కార్ట్‌గా ఎంపిక చేయాలి.
● 40–50 మంది విద్యార్థులకు ఒక
బస్సును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
● సురక్షిత, భద్రతకు ఆర్టీసీ బస్సులను
ఎంపిక చేసుకుంటే మేలు.
● ప్రయాణంలో అవసరమైన ఏర్పాట్లు
ముందుగా చేసుకోవాల్సి ఉంటుంది.
అవసరమైన మందులు, ఫస్ట్ ఎయిడ్
కిట్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
● ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి
ముందస్తు అనుమతి తీసుకుని వెళ్లాలి.
● ప్రతి పది మంది విద్యార్థులను ఒక బృందంగా
ఏర్పాటు చేసి, ప్రతి బృందానికి ఒక ఎస్కార్ట్
టీచర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.
ఏర్పాట్లు చేస్తున్నాం
విద్యార్థులు తరగతి గదిలో చదివిన విషయాన్ని ప్రత్యక్షంగా చూడడం ద్వారా లోతైన అధ్యయనం జరుగుతుంది. సమగ్ర శిక్ష ద్వారా ప్రాథమిక, సెకండరీ పాఠశాలల విద్యార్థులకు ఈ మేరకు నిధులు కేటాయించారు. విద్యార్థులు స్టడీ టూర్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం.
– జి.నాగమణి, ఆర్‌జేడీ,
పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
ప్రభుత్వ పాఠశాలల
విద్యార్థులకు విజ్ఞాన యాత్రలు
నిధులు కేటాయించిన
సమగ్ర శిక్ష విభాగం
వీక్షణతో విషయాసక్తి వృద్ధి
Comments
Please login to add a commentAdd a comment