
న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం
కొంతమూరుకి చెందిన యువతి ఆవేదన
రాజమహేంద్రవరం సిటీ: తనను పెళ్లిపేరుతో మోసం చేయడమే కాకుండా తనపై దాడిచేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులను ఆశ్రయిస్తే అక్కడా న్యాయం చేయకపోగా తనపైనే కౌంటర్ కేసు పెట్టి వేధిస్తున్నారని నెరుగొందల లక్ష్మీకాంతం ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయంపై రాజానగరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని, తనపై నలుగురు దాడి చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి ఒక్కరిని మాత్రమే అరెస్టు చేశారని ఆమె వాపోయింది. గతంలోనే తన కేసును నీరు గార్చేందుకు ప్రయత్నించిన పోలీసులు ఇప్పుడు నిందితులకు కొమ్ముకాస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. జాన దివ్య శేఖర్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుని అన్ని విధాలా మోసం చేశాడని ఆరోపించారు. రాజానగరం పోలీసులు తాము చెప్పిన చోటల్లా సంతకం పెట్టి కేసు విత్ డ్రా చేసుకోకపోతే తన పైనే కేసులు పెట్టి లోపల వేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించింది. అలాగే వారి మాట వినకపోతే ఇంట్లో గంజాయి పెట్టించి కేసు పెడతామని, వ్యభిచారం కేసు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇప్పటికై నా న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment