
మామూళ్లు.. గమ్మత్తుగా!
●
● మద్యం దుకాణాల నుంచి నెలవారీ వసూళ్లు
● స్థాయిని బట్టి నెలకు రూ.10 వేల నుంచి..
బెల్ట్ షాపుల దగ్గర రూ.3 వేలు
● ఇదే అదునుగా అడ్డగోలుగా విక్రయాలు
● పర్మిట్ రూములు పెట్టినా తనిఖీలు సున్నా
సాక్షి, రాజమహేంద్రవరం: ఎక్సైజ్‌శాఖలో మామూళ్ల మత్తు గుప్పుమంటోంది. ప్రతి మద్యం దుకాణం నుంచి కొంతమంది ఆ శాఖ సిబ్బంది నెలవారీ మామూళ్లకు ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. షాపులో జరిగే వ్యాపారాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా వసూళ్లు చేతులు మారుతున్నాయి. ఇందుకు ప్రత్యేకంగా ఆయా సర్కిళ్లలో ఓ ఎకై ్సజ్ కానిస్టేబుల్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. షాపుల పరిధిలో నడిచే బెల్టు దుకాణాలను సైతం వదలట్లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమ్యామ్యాలు ముట్టజెబుతుండటాన్ని అదునుగా తీసుకుంటున్న మద్యం వ్యాపారులు ఇష్టానుసారంగా మద్యం విక్రయిస్తున్నారు. డోర్ డెలివరీ చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అనధికార పర్మిట్ రూములు పెట్టి మరీ తాగిస్తున్నా కనీసం అటువైపు కనెత్తి చూసే అధికారి కరువయ్యాడు. వెరసి గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. దీనికి తోడు పోలీసులు సైతం ఇదే పంథా కొనసాగిస్తుండటంతో మద్యం అక్రమ వ్యాపారం ‘మూడు క్వార్టర్లు... ఆరు బీర్లు’ అన్న చందంగా సాగుతోంది.
ఒక్కో దుకాణం నుంచి రూ.10 వేలు?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాలను ప్రైవేటు పేరుతో వారి తమ్ముళ్లకు కట్టబెట్టింది. ఇదే అవకాశంగా మలచుకున్న బ్రాందీ షాపుల యజమానులు అక్రమ ఆదాయంపై దృష్టి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా 125 మద్యం దుకాణాలకు అబ్కారీ శాఖ అనుమతులు ఇచ్చింది. ఇంకేముంది ఆ శాఖలోని కొందరు అధికారులే అడ్డగోలు వ్యవహారానికి దిగారు. ఒక్కో దుకాణానికి ఒక్కో ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో మద్యం దుకాణదారు ప్రతి నెలా రూ.10 వేలు ఎకై ్సజ్ శాఖకు కప్పం కట్టాల్సిందే. వాటి పరిధిలోని బెల్టు షాపులకు ఒక్కో దుకాణానికి రూ.3 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రతి నెలా ఇది తప్పనిసరి చేశారు. ఎవరైనా కాదంటే ఆ దుకాణాలపై దాడులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఆయా ఎకై ్సజ్ శాఖ సర్కిల్ పరిధిలో వసూళ్లకు ఓ సిబ్బందిని నియమించినట్లు తెలిసింది. తాము వసూలు చేసి ఉన్నతాధికారులకు చెల్లించాలని చెబుతూ దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో విమర్శలకు దారితీస్తోంది. మామూళ్లు దండుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
నిద్రావస్థలో టాస్క్‌ఫోర్స్
దుకాణాల వద్ద అధిక ధరలకు మద్యం విక్రయించినా, బెల్టు షాపులను అరికట్టేందుకు ఏర్పాటైన ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందం నిద్ర నటిస్తోంది. ప్రతి షాపు వద్ద పర్మిట్ రూంలు ఏర్పాటు చేసి తాగించేస్తున్నా ఒక్క చోటా దాడులు చేసిన పాపాన పోలేదు. నిబంధనల మేరకు దుకాణాల వద్ద గ్లాస్, స్టఫ్ లాంటి వస్తువులు విక్రయించకూడదు. కానీ అవేమీ పట్టనట్లు ప్రతి చోటా విక్రయించేస్తున్నారు. కొందరైతే షాపుల వద్దే తప్పతాగుతున్నా.. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఒక్క కేసైనా నమోదు చేశారా?
మద్యం దుకాణాల ఆధ్వర్యంలో బెల్టు షాపులు నిర్వహిస్తే దాని అనుమతులు రద్దు చేస్తామని స్వయాన సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతి షాపు పరిధిలో 30కు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఇది తెలిసినా ఎకై ్సజ్ అధికారులు ఒక్క షాపుపైనా దాడులు చేసిన దాఖలాలు లేవు. ఇటీవల రెండు గ్రామాల్లో బెల్టు దుకాణాల్లో మద్యం పట్టుబడింది. అయినా కేసులు నమోదు చేయడంలో ఎకై ్సజ్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
పోలీసుల మిలాఖత్!
మద్యం వ్యాపారులతో కొందరు పోలీసులు సైతం మిలాఖత్ అయినట్లు విమర్శలున్నాయి. బ్రాందీ దుకాణాల వద్ద నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్న తెలిసింది. మీది మీరు తీసుకోండి.. మాది మేము తీసుకుంటామన్నట్టు కొందరు ఎక్సైజ్, పోలీసులు వ్యహరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఏరులై పారుతున్న మద్యం
అడిగేవాడు, అడ్డుచెప్పేవాడు లేకపోవడంతో మద్యం సిండికేట్ ఇష్టానుసారంగా రెచ్చిపోతోంది. సింహభాగం మద్యం దుకాణాలు దక్కించుకున్న కూటమి నేతల నేతృత్వంలోని సిండికేట్ ధనార్జనే ధ్యేయంగా విక్రయాలు చేపడుతోంది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా మద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా కనీసం 30కి పైగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా బెల్ట్ షాపు ప్రారంభించేశారు. బడ్డీకొట్లు, పాన్‌షాపులు, కర్రీ సెంటర్ల వద్ద యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. వైన్ షాపుల నుంచి ఎమ్మార్పీకి కొనుగోలు చేస్తున్న బెల్ట్ వ్యాపారులు క్వార్టర్ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.30 వరకు అదనంగా వసూళ్లు చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి ఫోన్ కొడితే చాలు మద్యం ఇంటి వద్దకు చేరుస్తున్నారు. బెల్ట్ షాపుల వ్యవహారం సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వైరల్‌గా మారడంతో దాడులు చేశారే తప్ప.. కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు.
చురుగ్గా సాగుతున్న మద్యం విక్రయాలు
Comments
Please login to add a commentAdd a comment