
పరిశ్రమలను తరచూ తనిఖీ చేయాలి
సేఫ్టీ కమిటీలకు కలెక్టర్ ప్రశాంతి ఆదేశం
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): జిల్లాలోని రసాయన ఇతర పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. పరిశ్రమల్లో సాంకేతిక అంశాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి చిన్న తప్పిదం జరిగినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. అస్సాగో, ఏపీ పేపర్ మిల్, ఠాగూర్ ల్యాబ్, ధరణి కెమికల్ వంటి పరిశ్రమల సాంకేతిక అంశాలపై తనిఖీలు చేసి నివేదికల సమర్పించాలన్నారు. జిల్లాలో పరిశ్రమలకు ప్రోత్సాహం అందించేందుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఒక్క చోటే ఇస్తున్నట్లు తెలిపారు. గిరిజన ఉత్పత్తులను స్థానికంగానే కాకుండా దేశ, అంతర్జాతీయ మార్కెటింగ్‌లో విక్రయించేందుకు ఆన్‌లైన్ సౌకర్యం కల్పించాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అనుమతి లేకుండా మట్టి, గ్రావెల్ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. అనుమతి రవాణా పత్రం లేకుండా రవాణా చేయకూడదన్నారు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారు శిక్షార్హులన్నారు.
భాగ్యనగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం
ఇద్దరు కార్మికులకు గాయాలు
గోపాలపురం: మండలం సగ్గొండ పంచాయతీ పరిధిలో గల భాగ్యనగర్ క్లోరైడ్ ప్రైవేటు లిమిటెడ్ ఫ్యాక్టరీలో శనివారం అల్యూమినియం ఫ్లోరైడ్ ఒక్కసారిగా బయటకు పొక్కడంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వారికి తాళ్లపూడి ప్రైవేటు ఆసుపత్రిలో యాజమాన్యం చికిత్స చేయించింది. ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మల్లిపూడి రాజ్‌కుమార్ తన పరిశీలనలో భాగంగా పైప్ నుంచి అల్యూమినియం పౌడర్ లీక్ కావడాన్ని గమనించి వెంటనే సుమారు 12 అడుగుల ఎత్తు నుంచి భయంతో కిందికి దూకాడు. దీంతో కాలి మడం విరిగినట్లు తెలిపారు. అలాగే పైపు కింద పనిచేస్తున్న మరో కార్మికుడు గంగుల నరేష్‌పై అల్యూమినియం పౌడరు పడడంతో మెడ, వీపు, కాళ్లు కాలిపోయినట్లు తెలిపారు. గతంలోనూ ఈ ఫ్యాక్టరీలో రెండు సార్లు అల్యూమినియం పైపులు పగిలి ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు తెలిపారు.

పరిశ్రమలను తరచూ తనిఖీ చేయాలి
Comments
Please login to add a commentAdd a comment