దాతల ఆశయాలకు తూట్లు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో దాతల ఆశయాలు నెరవేరడం లేదు. విరాళాల కోసం, భవనాల నిర్మాణం కోసం దాతల చుట్టూ తిరిగి అవసరం తీరాక వారు నిర్మించిన భవనాలను నిరుపయోగంగా వదిలేస్తుండడం వారి తీవ్ర మనస్తాపానికి తావిస్తోంది . తుని పట్టణానికి చెందిన దాత చెక్కా సూర్యనారాయణ (తాతబాబు) సమర్పించిన రూ.30 లక్షలతో నిర్మించిన నివేదన షెడ్డు నిరుపయోగంగా వదిలేసారు. దీంతో తాతబాబు అక్కడి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే సత్యదేవునికి నిత్యం ఏదో ఒక రూపంలో ఏదో ఒక లక్ష్యంతో దాతలు తోచినంత విరాళం సమర్పిస్తారు. కొన్ని సందర్భాలలో భారీ నిర్మాణాల కోసం అధికారులే దాతల వద్దకు వెళ్లి అభ్యర్థిస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వామివారి నివేదనశాల నిర్మాణానికి షెడ్డు నిర్మాణానికి తుని పట్టణానికి చెందిన చక్కా తాతబాబు నుంచి 2023 జూన్ నెలలో అప్పటి ఈఓ ఎస్‌ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ రూ.30 లక్షల విరాళాలాన్ని తీసుకువచ్చారు. ఈ మొత్తంతో దేవస్థానం పండితుల అనుమతితో నివేదన శాల నిర్మించి ఆగస్టు నెలలో దాతచే దీనిని ప్రారంభించారు. కొంత కాలం దీనిలోనే నివేదనలు సాగాయి.
కాగా 2023 నవంబర్‌లో ఈఓ చంద్రశేఖర్ అజాద్ బదిలీ కాగా ఆయన స్థానంలో ఇన్‌చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నివేదన శాల భూస్పర్శతో భూమి మీదనే ఉండాలని కొందరు పండితులు సూచించడంతో పాత నివేదనశాల లోనే నివేదనలు తయారు చేయాలని ఆదేశించారు. దీంతో 2023 నవంబర్ నుంచి పాత నివేదనశాల లోనే నివేదనలు తయారు చేయించి స్వామివారికి నివేదిస్తున్నారు. ఈ పరిణామాలపై దాత తాతబాబు అధికారులు కోరితేనే నివేదన భవనానికి విరాళం సమర్పించానని పేర్కొన్నారు. దేవస్థానంలో నివేదనలతో బాటు భక్తులకు పంపిణీ చేసేందుకు పులిహోర, దద్దోజనం, బాలభోగం, చక్రపొంగలి, కట్టు పొంగలిని నివేదనశాల లో తయారు చేస్తున్నారు. అలాగే దేవాలయంలో పనిచేసే అర్చకులు, వ్రత పురోహితులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఈ పదార్థాలను కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. అయితే దేవునికి పెట్టే నివేదనలు పాత నివేదన శాలలో తయారు చేసి భక్తులకు పంపిణీ చేసే వాటిని దాత నిర్మించిన షెడ్డులో తయారు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కొత్త షెడ్డును
వినియోగంలోనికి తెస్తాం
దాత తాతబాబు నిర్మించిన నివేదన షెడ్డును కూడా వినియోగంలోకి తేవాలని నిర్ణయించాం. ఇక్కడ భక్తులకు పంపిణీ చేసే పులిహోర, ఇతర ప్రసాదాలు తయారు చేయిస్తాం. ఇవి తయారు చేయడానికి ఒక కుక్, మరో సహాయకుడు అవసరం. వారిని నియమించడానికి ఎంఎల్‌సీ ఎన్నికల కోడ్ అడ్డుగా ఉంది. ఆ కోడ్ ముగిసాక వారిని నియమించి తదుపరి చర్యలు తీసుకుంటాం.
– వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం
రూ.30 లక్షలతో నిర్మించిన
నివేదనశాల నిరుపయోగం
కేవలం మూడు నెలల పాటే వినియోగం
లక్ష్యం నెరవేరడం లేదని ఆవేదన
వ్యక్తం చేస్తున్న దాత తాతబాబు
దాతల ఆశయాలకు తూట్లు
Comments
Please login to add a commentAdd a comment