సస్య రక్షణతో మరింత మధురం
పెరవలి: చెరకు సాగు చేయడానికి ఇదే అనువైన కాలం. ఈ సాగు చేసే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని కొవ్వూరు వ్యవసాయ సహాయ సంచాలకుడు (ఏడీఏ) పి.చంద్రశేఖర్ వివరించారు. జిల్లాలో పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, కొవ్వూరు, చాగల్లు, నల్లజర్ల, దేవరపల్లి, ద్వారకాతిరుమల, రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాల్లో 850 హెక్టార్లలో చెరకు సాగవుతోంది. ఈ సాగుకు తీసుకోవలసిన జాగ్రత్తలను పరిశీలిస్తే..
నేలల స్వభావం
ఈ పంటకు నీటి సదుపాయం ఉన్న మెరక భూములు అనువైనవి. భూములను 25 నుంచి 30 సెంటీ మీటర్ల లోతు వరకు మెత్తటి దుక్కు చేయాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేసి ఆఖరి దుక్కులో కలియదున్నాలి. చేనును సమాంతరంగా చేయాలి.
నాట్లు వేసే సమయం
ఉభయ గోదావరి జిల్లాల్లో చెరకు పంటను జాన్ నుంచి జాలై వరకు, డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు నాటుకోవచ్చు.
నాటే విధానం
మొదటిసారి వేసే రైతులు చేలో పూర్తిగా నీరు పెట్టి నీరు ఇంకిన 3 రోజుల తరువాత విత్తనం చెరకు గడలను ముక్కలుగా చేసి 2.5 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. కార్సీ తోటల రైతులు చేలో ఉన్న చెత్తకు నిప్పుపెట్టి అంటించిన తరువాత నీరు పెట్టాలి.
నీటి యాజమాన్యం
పంట వేసిన తరువాత 6 రోజులకు ఒకసారి 4 నెలల పాటు సాగు నీటిని అందించాలి. పక్వ దశలో 3 వారాలకు ఒకసారి నీరు అందించవచ్చు.
ఎరువుల యాజమాన్యం
చెరకు తోట వేసిన 45 రోజులు, 90 రోజులు, 120 రోజులకు ఎరువులను వేయాలి. నత్రజని 67 కిలోలు, భాస్వరం 40 కిలోలు, పొటాష్ 48 కిలోలు 3 సమభాగాలుగా చేసి వీటిని అందించాలి. వీటితో పాటు నత్రజనిని అందించే జీవన ఎరువులైన అజటోబాక్టర్ ఎకరానికి 2 కిలోల చొప్పున పశువుల ఎరువుతో కలిపి రెండు దఫాలుగా వేయాలి. నాటిన 3వ రోజున ఒకసారి, 45 రోజులకు మరోసారి వేసుకుంటే నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఎకరానికి 4 కిలోలు పాస్ఫా బాక్టీరియాను నాటిన 6వ రోజున వేసుకుంటే భాస్వరం ఎరువును కూడా తగ్గించుకోవచ్చు.
కార్సి తోటల సాగు
మొక్క తోటల కన్నా కార్సి తోటలు త్వరగా పక్వానికి వస్తాయి. సాగులో ఖర్చు కూడా తగ్గుతుంది. నీటిని తట్టుకునే గుణం ఈ తోటలకు ఉంటుంది. కార్సి తోటల్లో దుబ్బుల నుండి మొలకెత్తేటప్పుడు కలుపు నివారణకు మందులు వాడకూడదు. కార్సీ తోటలు ఉన్న రైతులు చేలో ఉన్న చెత్తను కాల్చడం కానీ, ఆ చెత్తను కుళ్లబెట్టడానిక ట్రైకోడెర్మా విరిడి మందును పేడనీళ్లతో కలిపి చెత్తపై చల్లాలి. దీనితో పాటు పది కిలోల సూపర్‌ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా రెండూ కలిపి చెత్తపై చల్లాలి. దీనివలన భూమిలో తేమశాతం నిలబడటమే కాకుండా చెత్త బాగా చివికి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పంటలపై ఎక్కువగా పీక పురుగు, కాండం తొలిచే పురుగు, పొలుసుపురుగు, తెల్ల నల్లి, లద్దె పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు పంటను ఆశించకుండా చేలలో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకుంటే కొంతవరకు వాటిని అరికట్టవచ్చు. పంటపై కాటుక తెగులు, ఎర్ర కుళ్లు తెగులు, మొవ్వ కుళ్లు తెగులు ప్రభావం అధికంగా ఉంటుంది. ఇవి ఆశించినప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
పెట్టుబడి వ్యయం తగ్గుదల
అధిక, నాణ్యమైన దిగుబడి
చెరకులో యాజమాన్య పద్ధతులు
సూచిస్తున్న వ్యవసాయ అధికారులు
సస్య రక్షణతో మరింత మధురం
సస్య రక్షణతో మరింత మధురం
Comments
Please login to add a commentAdd a comment