దేచెర్లలో ఎర్రమట్టి దొంగలు
సాక్షి, రాజమహేంద్రవరం: సహజ సంపద దోపిడీయే ధ్యేయంగా కూటమి నేతలు బరి తెగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డగోలు వ్యవహారానికి తెర తీశారు. అనుకున్నదే తడవుగా అక్రమాలకు తెర తీశారు. గ్రావెల్, మట్టి, ఇసుక ఇలా ప్రకృతి సంపదను కొల్లగొట్టి రూ.కోట్లు దండుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు కావడం, తమను అడ్డుకునే వారెవరన్న ధీమాతో చెలరేగిపోతున్నారు. కూటమి ఎమ్మెల్యేల అండదండలు పుష్కలంగా వారి ఉండటంతో వారి అనుచరులు ఎర్రమట్టి దొంగల అవతారం ఎత్తారు. ఎంతగా అంటే దోపిడీ మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలు అన్న చంద్రంగా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమాన్ని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం కాసుల కక్కుర్తితో అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మామూళ్ల దండుకుని తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం మట్టి తవ్వకాలతో సమీప ప్రాంతాల ప్రజలు విసుగెత్తిపోతున్నారు. ఇదేమీ దోపిడీ అంటూ విస్తుపోతున్నారు.
అనధికార తవ్వకాలు
కొవ్వూరు నియోజకవర్గం దేచెర్లలో ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మైనింగ్, రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం కనీస అనుమతులు లేకుండా ఎర్రమట్టి దందాకు తెర లేపారు. టీడీపీ, జనసేన నేతల కనుసన్నల్లో దందా సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి ధన దాహానికి దేచెర్ల సమీపంలోని ప్రాంతాలు గోతుల మయమయ్యాయి. కనుచూపు మేర ఎక్కడ చూసినా ఎర్రమట్టి తరలించగా ఏర్పడిన గోతులే దర్శనమిస్తున్నాయి. అక్రమ తవ్వకాలకు ఓ ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో ప్రాంతంలో 10 నుంచి 20 అడుగుల లోతు వరకు ఎడాపెడా తవ్వకాలు చేస్తున్నారు. పగలు, రేయి అన్న తేడా లేకుండా మట్టి తవ్వి తరలించేస్తున్నారు.
లారీ మట్టి రూ.8వేల నుంచి
రూ.15 వేలకు విక్రయం
రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సదరు లే అవుట్ల అభివృద్ధికి ఎర్రమట్టి అవసరం. ప్రధానంగా కడియం నర్సరీలకు ఎర్రమట్టి తప్పనిసరి. వీటితోపాటు ఇటుక బట్టీలలో సైతం వినియోగిస్తారు. ప్రభుత్వ అధికారిక మైనింగ్ క్వారీల నుంచి వీటిని తరలించుకోవాలంటే ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో పెద్ద ఎత్తున నగదు చెల్లించాల్సి ఉంటుంది. యూనిట్ గ్రావెల్‌కు రూ.320 మైనింగ్ శాఖకు చెల్లించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ అక్రమ వ్యాపారంలో రూ.కోట్లు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఈ డిమాండ్‌ను గమనించిన కూటమి దోపిడీ దారులు ప్రకృతి సంపదను కొల్లగొట్టి రూ.కోట్లు మింగడం కోసం వ్యూహాలు రచించారు. ఇందుకు దేచెర్ల గ్రామంలోని ఎర్రమట్టిని కేంద్రంగా చేసుకున్నారు. బడా నేతల అండదండలతో క్షేత్ర స్థాయినేతలు రంగంలోకి దిగారు. ఎర్రమట్టి అక్రమంగా తరలించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. మైనింగ్ శాఖకు రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండికొడుతున్నారు.
మామూళ్ల మత్తులో అధికారులు
అక్రమ తవ్వకాలు కళ్లెదుటే సాగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. వందల లారీలు అక్రమంగా మంటి తరిలించేస్తున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప అడ్డుకున్న దాఖలాలు లేవు. ప్రతి నెలా మామూళ్లు దండుకుని మిన్నకుండి పోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి మాఫియా ప్రతి నెలా రూ.లక్షల్లో మామూళ్లు సమర్పిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు అధికార పార్టీకి చెందిన నేతలు సూత్రధారులు కావడంతో అధికారులు అటు వెళ్లే సాహసం చేయడం లేదు. వచ్చింది చాల్లే అంటూ..జేబుల్లో వేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. మట్టి తరలింపు విషయమై ఇటీవల కొందరు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. ఆ గ్రామం ఎక్కడుంది..? ఎలా వెళ్లాలి..? అని ప్రశ్నించడాన్ని బట్టి చూస్తుంటే దోపిడీదారులకు ఎంతగా సహకరిస్తున్నారో అర్థం అవుతోంది.
ఇలా తవ్వేస్తున్నారు..
ఇలా తరలించేస్తున్నారు
150 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు
రోజుకు 200 లారీలకు
పైగా అక్రమ తరలింపు
నెలలుగా సాగుతున్న దందా
అనుమతులు లేకుండానే
యథేచ్ఛగా తరలింపు
బరి తెగిస్తున్న కూటమి నేతలు
సహజ సంపద దోచుకుంటున్న వైనం
మామూళ్ల మత్తులో
జోగుతున్న మైనింగ్ అధికారులు
రోజుకు 200 లారీలు
కొవ్వూరు నియోజకవర్గం దేచెర్లలో 150 ఎకరాల్లో ఎర్రమట్టి దందా సాగుతోంది. ప్రతి రోజూ 200 లారీల్లో వివిధ ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారు. ట్రాక్టర్ మట్టి సుమారుగా రూ.5 వేలు, లారీకి రూ.8వేల నుంచి రూ.15 వేల వరకు దండుకుంటున్నట్లు సమాచారం. అంటే మట్టి మాఫియాకు ప్రతి రోజూ రూ.30 లక్షలకు పైగా ఆదాయం లభిస్తోంది. నెలకు రూ.9 కోట్లు కూటమి నేతల జేబుల్లోకి వెళుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరాటంకంగా తవ్వకాలు సాగుతున్నాయి. దీన్ని బట్టిచూస్తే రూ.కోట్లు కూటమి నేతల జేబుల్లోకి వెళ్లినట్లు సమాచారం.
దేచెర్లలో ఎర్రమట్టి దొంగలు
Comments
Please login to add a commentAdd a comment