నేత్రపర్వంగా భీమేశ్వరస్వామి రథోత్సవం
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామభీమేశ్వరస్వామి రథోత్సవం గురువారం నేత్ర పర్వంగా జరిగింది. ఈ నెల 24వ తేదీన జరిగిన స్వామివారి కల్యాణాన్ని పురస్కరించుకొని సాయంత్రం రథోత్సవం జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు ఈఓ బళ్ల నీలకంఠం, ఉత్సవాల ప్రత్యేకాధికారి కెవీ సూర్యనారాయణల ఆధ్వర్యంలో స్వామి వారిని అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయం నుంచి గాంధీచౌక్‌కు తీసుకొని వచ్చారు. ఆలయ పండితుల వేద మంత్రాల మధ్య స్వామి వారిని అమ్మవార్లను పూలతోను, విద్యుత్తు దీపాలతో అలంకరణ చేసిన రథంపై ఉంచారు. రథోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కొడా చైర్మన్ తుమ్మలబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబులు రథోత్సవాన్ని ప్రారంభించారు. పురవీధుల గుండా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, బాణసంచా కాల్పులు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. దారి పొడవునా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సోమవారం రాత్రి స్వామి వారి శ్రీపుష్పయోగోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
నేత్రపర్వంగా భీమేశ్వరస్వామి రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment