ద్రాక్షారామలో పేలుడు కలకలం
రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామలో పేలుడు కలకలం చోటు చేసుకుంది. ద్రాక్షారామ ఎస్సై ఎం. లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం బాధిత కుటుంబం ఎండీ జాఫర్ హుస్సేన్ అతని భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడుతో కలసి ద్రాక్షారామ నున్నవారి వీధిలో నివాసం ఉంటున్నారు. జాఫర్ మార్కెట్‌లో మటన్ దుకాణం నడుపుకుంటున్నాడు. సోమవారం రాత్రి భోజనం చేసి భార్య, కుమార్తెలు పెంకుటింటిలో నిద్రపోగా, జాఫర్, అతడి కుమారుడు ఇంటి పెరటిలో ఉన్న రేకుల షెడ్డులో నిద్రపోయారు. అర్ధరాత్రి 1.15 గంటలకు పేలుడు శబ్దం, మంటలు రావడంతో భయపడి లేచి బయటకు వచ్చి చూసేసరికి అదే గ్రామానికి చెందిన మహమ్మద్ రోషన్ అబ్బాస్, మరో ఇద్దరు గుర్తు తెలియని యువకులు వీరిని చూసి మోటారు సైకిళ్లపై పారిపోయారు. గాజు సీసాలకు చుట్టిన ఔట్లు, పేలుడు పదార్థాలతో ఇంటిపై దాడి చేశారని, గతంలో రోషన్ అబ్బాస్ భావ మహ్మద్ అలీహుస్సేన్‌కి తనకి మసీదు విషయంలో ఉన్న గొడవలను దృష్టిలో పెట్టుకుని తమ కుటుంబాన్ని చంపాలని, ఇంటిని నాశనం చేసి ఆస్థి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో తమపై దాడికి పాల్పడ్డారని జాఫర్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ వెంకట నారాయణ సిబ్బందితో కలసి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment