నిమ్మకు తెగుళ్ల బెడద
పెరవలి: జిల్లాలో నిమ్మపంట 720 హెక్టార్లలో సాగు జరుగుతుండగా వివిధ రకాల తెగుళ్లు ఆశించి ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడి, తోటలు పాడైపోతున్నాయి. ముఖ్యంగా ఈ పంటపై ఆకు ముడత, పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు, బంక, వేరుకుళ్లు, గజ్జి, మొజాయిక్ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు గురించి కొవ్వూరు ఉద్యాన అధికారి (ఏడీఏ) సీహెచ్ శ్రీనివాస్ వివరించారు.
ఆకుముడత : ఈ తెగులు ఎక్కువగా లేత చిగుర్లపై ఆశించి ఆకులపై తెల్లటి పొరలు వంకర టింకరగా ఏర్పడి ఆకులు ముడుచుకునేలా చేస్తుంది. తద్వారా ఆకులపై గజ్జి తెగులు ఎక్కువగా వ్యాప్తి చెంది ఆకులు రాలిపోతాయి.
నివారణ చర్యలు : ఆకులు ముడతలు పడినట్లు గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండవసారి పిచికారీ చేయాలి.
తెల్లపొలుసు పురుగులు : ఈ పొలుసు పురుగులు ఎక్కువగా కాండంపై ఆశించి సున్నం పూసినట్లుగా కనపడతాయి. ఇవి కాండం, కొమ్మలలో రసాన్ని పీల్చివేయటం వల్ల అవి ఎండిపోతాయి.
నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించిన చోట గోనె సంచితో బాగా రుద్ది మిధైల్‌డెమటాన్ లేదా డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి కాండం, కొమ్మలపై పిచికారీ చేయాలి.
నల్లి పురుగులు : నల్లి పురుగుల్లో ఆకుపచ్చ నల్లి, మంగు నల్లి ముఖ్యమైనవి. ఆకునల్లి ఆకులపైన, మంగునల్లి కాయలపైన ఆశించి రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల కాయలపై చిన్న చిన్న తెల్లని మచ్చలు లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది.
నివారణ చర్యలు : నీటిలో కరిగే గంధకం 3గ్రాములు లేదా డైకోఫాల్ 5.0 మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారణ అవుతుంది.
రసం పీల్చే రెక్కల పురుగులు : ఈ రెక్కల పురుగులు పండ్లపై రంథ్రాలు చేసి కాయలో ఉండే రసాన్ని పీల్చుతాయి. దీంతో కాయలకు చేసిన రంథ్రాల ద్వారా శిలీంద్రాలు, బ్యాక్టీరియా చేరి పండ్లు కుళ్లి, రాలిపోతాయి. పండ్లపై డాగు ఏర్పడుతుంది.
నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించి కుళ్లి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. పురుగులను నాశనం చేయటానికి మలాథియాన్ ఒక మిల్లీలీటరు మందుకు ఒక శాతం పంచదార, పండ్ల రసం కలిపి చెట్ల కింద అమర్చాలి. పురుగులను ఆకర్షించటానికి బల్బులను ఏర్పాటు చేయాలి. దీని ద్వారా పురుగులను అరికట్టవచ్చు. పురుగుల నుంచి కాయలను రక్షించటానికి కాయలకు బుట్టలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బంక తెగులు : బంక తెగులు రెండు రకాలు ఒకటి ఫెటోఫ్తోరా, రెండు డిఫ్లోడియా. మొదటి తెగులు ఆశించిన చెట్టు నుంచి ధారాళంగా బంక కారుతుంది. ఇది చెట్టు వేళ్లకు, మొదలు కింది భాగానికి పరిమితమై ఉంటుంది. డిఫ్లోడియా బంక తెగులు చెట్టు మొదలు పైభాగాన కొమ్మల పంగల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు ఎక్కువగా ఉంటే బంక కారటం, బెరడు కుళ్లటం జరుగుతుంది. నీరు త్వరగా ఇంకని భూముల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది.
నివారణ చర్యలు : బంక కారి కుళ్లిన బెరడును పూర్తిగా తొలగించి బోర్డోపేస్టు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్టు పూయాలి. ఈ పేస్టును మొదలు చుట్టూ పూయాలి. కొమ్మలపై వచ్చే బంక తెగులు నివారణకు లీటరు నీటికి 1గ్రాము కార్బండజిమ్ కలిపి చెట్టు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. మెటలాక్సిల్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి చెట్టు మొదలులో పోయాలి.
వేరుకుళ్లు తెగులు : వేరుకుళ్లు తెగులు ఆశించిన చెట్టుకు పోషక పదార్థాలు అందక చెట్లు ఎండిపోతాయి. ఈ తెగులు ఆశించిన చెట్లు ఎక్కువ పూతపూసి కాయలు ముదిరే లోగా చెట్లు వాడి ఎండిపోతాయి. ఎండిన చెట్ల వేర్లను పరీక్షిస్తే కుళ్లిన వాసన వస్తుంది.
నివారణ చర్యలు : వ్యాధి సోకిన తొలి దశలోనే గమనించి చెట్టుకు ఎక్కువగా నీరు కట్టి మరుసటి రోజు కార్బండజిమ్ 2 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా చెషంట్ 3 గ్రాములు లేదా ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి చెట్టు చుట్టూ నేల తడిసేలా పిచికారీ చేయాలి. చెట్టుకి కావలిసిన పోషక పదార్థాలు సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట ద్వారా అందించాలి. ఒక కిలో ట్రైకోడెర్మా మందును 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేపపిండితో కలిపి 15 రోజులు మాగపెట్టి చెట్టు మొదలు చుట్టూ వేయాలి. ఇలా చేస్తే చెట్టును ఈ తెగులు నుంచి కాపాడవచ్చు.
గజ్జి తెగులు (కాంకర్ మచ్చ) : నిమ్మ పంటపై ఎక్కుగా ఆశించే తెగులు ఈ గజ్జి తెగులు. ఇది కాయలు, ఆకులు, చిన్న, పెద్ద కొమ్మలను ఆశిస్తుంది. తెగులు ప్రభావం అధికంగా ఉంటే చెట్లు ఎండిపోయి చనిపోతాయి.
నివారణ చర్యలు : ఈ తెగులు సోకి ఎండిన కొమ్మలను కత్తిరించి స్ట్రెప్టోసైక్లిన్ ఒక గ్రాము, 30 గ్రాములు బ్‌లైటాక్స్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. గజ్జి ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గోకి బెరడును తీసి వేసి బోర్డోపేస్టును పూయాలి.
నిమ్మకు తెగుళ్ల బెడద
నిమ్మకు తెగుళ్ల బెడద
నిమ్మకు తెగుళ్ల బెడద
నిమ్మకు తెగుళ్ల బెడద
నిమ్మకు తెగుళ్ల బెడద
Comments
Please login to add a commentAdd a comment