బెట్టింగ్‌ల మోజులో యువత
జీవితాలు బలైపోతాయని హెచ్చరిస్తున్న పోలీసులు
రాజానగరం: అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పొందుతున్న విజ్ఞానాన్ని సమాజ హితం కోసం కాకుండా తప్పుడు మార్గాలలో సంపాదనలకు కొంతమంది స్వార్థపరులు ఉపయోగిస్తుంటే, వాటికి ఆకర్షితులై కొంతమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ బిడ్డలు ఉన్నతంగా ఉండాలి, ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయాలనే ఆశతో చాలామంది తల్లిదండ్రులు తమ కడుపులు మాడ్చుకుని, అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో దూర ప్రాంతాలలోని కళాశాలలలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు హాస్టల్స్‌లో ఉంటూ చదువులు సాగిస్తుంటారు. అయితే ఇటువంటి వారిలో కొంతమంది చెడు స్నేహాలతో కన్నవారి ఆశలను వమ్ము చేయడమే కాకుండా, తమ బంగారు జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు.
బ్రిడ్జి కౌంటీ కేంద్రంగా ...
విద్యా, వ్యాపార రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరం సమీపంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు అనేక ఉండటంతో యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు నిర్వహించే వ్యక్తులు ఈ ప్రాంతాన్నే తమ కేంద్రంగా చేసుకుని, బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బ్రిడ్జి కౌంటీలో 12 మంది నిందితులు పట్టుబడ్డారు. చేపల చెరువుల ద్వారా ఆర్థికంగా నష్టపోయిన భీమవరానికి చెందిన దండు వెంకటవర్మ అనే సంతోష్ (31), కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు చెందిన ఇమ్మంది భరత్‌కుమార్ (34)తో కలిసి బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాను అద్దెకు తీసుకుని, కొన్ని నెలలుగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరినీ అడ్మిన్లుగా చేసుకుని, భీమవరం నుంచి దుబాయ్ వెళ్లిన వినీత్ అనే మరో వ్యక్తి కీ రోల్ పోషిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బ్రిడ్జి కౌంటీలో ఇటువంటి కార్యకలాపాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి వాటి గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేసి, సహకరించాలని నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. తప్పుడు మార్గాలలో పయనించి, జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు ఆయన హితవు పలికారు. హాస్టల్స్‌లో ఉంచి చదివిస్తున్న తమ పిల్లల ప్రవర్తనలపై తల్లిదండ్రులు కూడా నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
క్రికెట్ బెట్టింగ్‌లే అధికం
సమాచారం కోసం కనుగొన్న సెల్‌ఫోన్ నేడు అందరికీ జీవితంలో ఒక భాగమైపోయింది. చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు సెల్‌ఫోన్ ముట్టుకోకుండా రోజుగడవడం లేదనడం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఇక విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో పేకాట, గుండాటల తరహాలోనే ఆన్‌లైన్‌లో అనేక రకాల యాప్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. అనేక మంది వాటికి ఆకర్షితులవుతున్నారు. తెలిసీ తెలియని పరిజ్ఞానంతో వారి బ్యాంకు అకౌంట్ల వివరాలు అపరిచితులకు తెలియజేయడమే కాకుండా తల్లిదండ్రుల అకౌంట్లను కూడా కొల్లగొట్టేందుకు తోడ్పడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అమాయకులు భయంతో బయటకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుందోననే భయంతో జీవితాలను అర్ధంతరంగా ముగించుకునే పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఇటువంటి వాటిలో క్రికెట్ బెట్టింగ్‌లే ఎక్కువగా ఉన్నాయి. బార్బర్ షాపులలో కూడా టీవీలను పెట్టుకుని, యాప్‌ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. వీటిని నిరోధించేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా, సరైన ఫలితాలు కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment