4 నుంచి ‘నన్నయ’లో నారీ ఫెస్ట్
రాజానగరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో వచ్చే నెల 4 నుంచి నారీ ఫెస్ట్ 2025 నిర్వహించనున్నామని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో మహిళలకు వివిధ విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం విలేకరులకు తెలిపారు. మొదటి రోజు సెమినార్ హాల్లో హెల్త్ బేబీ పోటీలు, కన్వెన్షన్ సెంటర్‌లో బామ్మ–మనుమరాలి ఫ్యాషన్ షో జరుగుతుందన్నారు. హెల్త్ బేబీ పోటీలకు రాజమహేంద్రవరం పరిసరాలలోని ఐదేళ్లలోపు చిన్నారులు (ఆడ – మగ) పాల్గొనవచ్చన్నారు. వీటికి సంబంధించిన వివరాలకు 63057 89433 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు. బామ్మ–మనుమరాలు ఫ్యాషన్ షోలో పాల్గొనే బామ్మల వయస్సు 60 సంవత్సరాలు పైబడి ఉండాలని, మనుమరాలి వయసు ఐదు నుంచి పదేళ్ల వరకు ఉండవచ్చన్నారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.150 చెల్లించి, మార్చి 3లోగా పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. వీటికి సంబంధించిన వివరాలకు 99126 62500 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.
క్యాంపస్‌లోని మహిళల కోసం
అదే రోజు మహిళల కోసం ప్రత్యేక పోటీలు ఉంటాయని వీసీ తెలిపారు. యూనివర్సిటీతోపాటు తాడేపల్లిగూడెం, కాకినాడ క్యాంపస్‌లలోని మహిళ విద్యార్థులు, సిబ్బంది వీటిలో పాల్గొనవచ్చన్నారు. గ్రూప్ సింగింగ్, ఫ్యాషన్ షో, స్కిట్, డాన్స్ వంటి పోటీలు ఉంటాయి. వీటిలో పాల్గొనే వారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ అన్నారు. స్థానిక పాఠశాలలో కూడా పోటీలు నిర్వహించే అవకాశం ఉందన్నారు.
రెండో రోజు అనుబంధ కళాశాలల సిబ్బందికి పోటీలు
రెండోరోజు (మార్చి 5)న యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న గోదావరి జిల్లాలోని కళాశాలల సిబ్బందికి వివిధ పోటీలు ఉంటాయి. సృజనాత్మకతతో కూడిన వస్తువుల తయారీ (చేతి పనులు, చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీ, పూల అలంకరణ వంటివి) పై పోటీలు జరుగుతాయి. పాల్గొనేవారు మార్చి 4లోగా రూ. 100 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి, పేర్లు నమోదు చేయించుకోవాలి.
మూడో రోజు నారీ ఫెస్ట్ 2025
మూడో రోజు నారీ ఫెస్ట్ 2025లో భాగంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం నిర్వహిస్తామని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ తెలిపారు. పై రెండు రోజులలో నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేస్తారు. ఈ సందర్బంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు యూనివర్సిటీ వుమెన్ సెల్ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment