సూపర్ సిక్స్ ఓ బూటకం
● ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలు 143
● ఒక్కటి కూడా అమలు చేయలేదు
● పథకాలు ఎగ్గొట్టడానికి ఆర్థిక వ్యవస్థ ధ్వంసమంటూ తప్పుడు ప్రచారం
● వైఎస్సార్ సీపీ నేత తలారి వెంకట్రావు
చాగల్లు: కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ పథఽకాల అమలు ఒట్టి బూటకమని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. చాగల్లులో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై ఘాటుగా విమర్శించారు. ఎన్నికల్లో కూటమి నేతలు సూపర్ సిక్స్ మాత్ర కాదని, మొత్తం 143 హామీలు ఇచ్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది గడుస్తున్నా ఒక్క పథకం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను రద్దు చేయానికి, ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టడానికి, ఒకటీ అరా ఇచ్చినా పూర్తిగా కోతలు విధించడానికే ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా తలారి వెంకట్రావు ఏమన్నారంటే..
● దీపం పథకంలో భాగంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లని చెప్పారు. మొత్తం 1.55 కోట్ల లబ్ధిదారులుంటే 86 లక్షల మందికే ఒక్కో సిలిండర్ చొప్పున కేవలం రూ.686 కోట్లు మాత్రమే రీయింబర్స్ చేసినట్లు సాక్షాత్తూ గవర్నర్‌తోనే చెప్పించారు. తద్వారా ఈ పథకం ఎంత మోసమో తేలిపోయింది.
● డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకు ండా రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేస్తున్నారు.
● అధికారంలోకి వచ్చి ఏడాదే రైతు భరోసా, అమ్మ ఒడి రెండూ ఇవ్వలేదు. మే నెలలో అమ్మ ఒడి ఇస్తామంటున్నారు. దీనిని రెండేళ్లకూ కలిపి ఇస్తారా? ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ అనే మాట ఇప్పటికీ చెప్పడం లేదు.
● పీఎం కిసాన్ కాకుండా అన్నదాతా సుఖీభవకు రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు పీఎం కిసాన్‌తో కలిపి ఇస్తామంటున్నారు. ఏమిటీ మోసం? ఇది కూడా ఎంత మందికి ఇస్తారో, రెండేళ్లకు కలిపి ఇస్తారా అనేది వెల్లడించడం లేదు.
● అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో సాధించామని చెప్పుకొంటున్న రైల్వే జోన్‌కు కూడా భూమి ఇచ్చింది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే. కూటమి వచ్చాక, ఆదాయం వచ్చే రైలు మార్గాలను, రైల్వే స్టేషన్లను ఒడిశాకు అప్పజెప్పారు. చిక్కి శల్యమైన జోన్‌ను సాధించి, ప్రజలకు ద్రోహం చేసి, దానిని కూడా గొప్పగా చెప్పుకుంటూ, అనుకూలంగా వక్రీకరించుకుంటున్నారు.
● కుటుంబాన్ని చూసుకోలేని వారు దేశాన్ని ఎలా చూసుకుంటారని గతంలో ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు దూషించారు. ఆయన కుటుంబాన్ని నీచంగా మాట్లాడారు. అమిత్‌షాపై తిరుపతిలో ఏకంగా రాళ్ల దాడి చేయించారు. ఇప్పుడు కాళ్లావేళ్లా పడి పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ మోదీని పొగడటం హాస్యాస్పదం.
● మధ్యాహ్న భోజనానికి మహాతల్లి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఘోరమైన భోజన కార్యక్రమమైంది. రోజుకో మెనూ పోయింది. కలుషితాహార ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. పిల్లలు ఆస్పత్రుల్లో చేరుతున్న పరిస్థితులు రాష్త్రంలో ప్రతి రోజూ నెలకొంటున్నాయి.
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయంలో నిరుపేదలందరికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకూ వైద్యాన్ని ఉచితంగా అందించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్యతరగతి ప్రజలకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మధ్యతరగతి వారికి చికిత్స వ్యయాన్ని రూ.2.5 లక్షలకే పరిమితం చేసింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా మూసేసి, ఆరోగ్య బీమా పేరుతో వేల కోట్ల రూపాయల ప్రీమియం కొట్టేయడానికి ప్లాన్ చేశారు. దీనిని ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి పెద్ద స్కాం చేస్తున్నారు.
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తయిన ఇళ్లనే కూటమి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని, పేదలకు ఇళ్ల నిర్మాణంలో ఏదో చేసేసినట్లు చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల నాటికే 9.02 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. అప్పటికి నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఈ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం ఆశ్చర్యకరం. వాట్సాప్‌లో సిటిజన్ సర్వీసుల సంగతేమో కానీ, హాయ్ అని కొట్టగానే వెంటనే మందు వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment