పారిశుధ్య నిర్వహణపై సందిగ్ధత
● రత్నగిరిపై కొలిక్కిరాని వ్యవహారం
● నేటితో ముగియనున్న
కేఎల్‌టీఎస్ కాంట్రాక్ట్
● తాత్కాలికంగా కొత్త ఏజెన్సీ ఎంపిక
● అయినా తొలగని గందరగోళం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌టీఎస్ సంస్థ కాంట్రాక్ట్ శుక్రవారంతో ముగియనుంది. తాత్కాలికంగా కొత్త ఏజెన్సీకి ఈ పనులు అప్పగించగా.. దీనికి అవసరమైన మెషీన్లు, ఇతర సామగ్రి వంటివి సమస్యగా మారుతోంది. దీంతో వ్యవహారం కొలిక్కిరాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలివీ.. అన్నవరం దేవస్థానంలో కేఎల్‌టీఎస్ సంస్థ రెండేళ్లుగా శానిటరీ విధులు నిర్వహిస్తోంది. గత ఏడాది నవంబర్ నెలతోనే ఈ సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగిసింది. ఈ పరిస్థితుల్లో టెండర్ ద్వారా కొత్త సంస్థను ఎంపిక చేసేంత వరకూ ఈ విధులు నిర్వహించాలని కేఎల్‌టీఎస్ సంస్థను దేవస్థానం కోరింది. దీంతో ఆ సంస్థ సిబ్బంది ఈ నెలాఖరు వరకూ ఆ పనులు నిర్వహించారు. మార్చి 1 నుంచి తాము ఆ విధులు నిర్వహించలేమని ఆ సంస్థ దేవస్థానానికి లేఖ సమర్పించింది. దీంతో దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్‌ను అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఈ నెల 14న విజయవాడలో కలిసి, పరిస్థితి వివరించారు. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి నెల రోజుల పాటు దేవస్థానంలో శానిటరీ పనులకు అవసరమైన సిబ్బంది సరఫరాకు గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్ సంస్థను తాత్కాలికంగా ఎంపిక చేశారు.
మెటీరియల్, మెషీనరీ సమస్య
పారిశుధ్య సిబ్బంది సరఫరాకు ఏజెన్సీని ఎంపిక చేసినప్పటికీ, ఫినాయిల్, యాసిడ్, ఇతర లిక్విడ్స్ వంటి శానిటరీ మెటీరియల్ కొనుగోలు సమస్యగా మారింది. ఇప్పటి వరకూ కేఎల్‌టీఎస్ సంస్థే వీటన్నింటినీ సరఫరా చేసి, పనులు నిర్వహించేది. ఆ పనులు సరిగ్గా లేకపోతే దేవస్థానం మరోసారి చేయించేది. ఇప్పుడు నాణ్యమైన శానిటరీ సామగ్రిని దేవస్థానమే కొనుగోలు చేయాల్సి ఉంది. అలాగే, ఆలయ ఆవరణను కడగడానికి అవసరమైన మెషీన్లు కేఎల్‌టీఎస్ సంస్థ వద్దనే ఉన్నాయి. ఆ సంస్థ వాటిని తీసుకుని వెళ్లిపోతే పరిస్థితేమిటనే మీమాంస అధికారుల్లో నెలకొంది. నిత్యం వేలాదిగా భక్తులు వచ్చే అన్నవరం దేవస్థానంలో 24 గంటలూ పారిశుధ్యం, సత్రాల్లో హౌస్ కీపింగ్, ఆలయ ప్రాంగణంలో శుభ్రత తదితర పనులు నిరంతరాయంగా జరగాల్సి ఉంది. ఒక్క రోజు ఈ పనులు ఆగిపోయినా భక్తులకు ఇబ్బంది తప్పదు. ఈ పరిస్థితిని కమిషనర్‌కు వివరించామని, ఆయన నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ శానిటరీ మెటీరియల్, మెషీనరీని తీసుకుని వెళ్లవద్దని కేఎల్‌టీఎస్ సంస్థ కాంట్రాక్టర్‌ను కోరామని దేవస్థానం అధికారులు చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని ఏడు దేవస్థానాలను ఒకే యూనిట్‌గా రెండేళ్లకు శానిటరీ టెండర్ పిలుస్తారని, అప్పటి వరకూ తాత్కాలిక ఏర్పాట్లు తప్పవని తెలిపారు. ఈ విషయంలో కలెక్టర్ షణ్మోహన్ జోక్యం చేసుకుంటే తప్ప సమస్య పరిష్కారం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అన్నవరం దేవస్థానం
Comments
Please login to add a commentAdd a comment