బడ్జెట్ అంకెల గారడీ
రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్డెట్ అంకెల గారడీ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజమనే విషయం బడ్జెట్ ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు.సూపర్ సిక్స్ సహా హామీలన్నీ విస్మరించి, పిల్లలు, యువత, మహిళలు, నిరుద్యోగులు, రైతులు ఇలా అన్ని వర్గాలనూ కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు. తల్లికి వందనం అంటూనే బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లకు పైగా కోత పెట్టారన్నారు. పేద, బీసీ వర్గాలంటే చంద్రబాబుకు కడుపు మంటని, అందుకే గత ఏడాది ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు నిలుపు చేశారని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు కూడా అరకొరగానే ఉన్నాయన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అవ్వాతాతలకు, దివ్యాంగులకు ఇచ్చే ఫించన్లు, మహిళలకు ఇచ్చే ఉచిత గ్యాస్ సిలిండర్లలో సైతం కోత విధించారన్నారు. రాష్ట్రంలో 1.48 కోట్ల మంది రేషన్‌కార్డుదారులుండగా బడ్జెట్‌లో కేవలం 90.1 లక్షల మందికే నిధులు కేటాయించారని చెప్పారు. 2019–24 మధ్య నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలోని ప్రతి హామీనీ క్యాలెండర్ ప్రకారం అమలు చేశారని వేణు గుర్తు చేశారు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా వ్యాప్తంగా 51 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలు నిర్వహించారు. జనరల్ విభాగంలో 21,024 మందికి గాను 20,448 మంది విద్యార్థులు హాజరయ్యారు. 576 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 2,281 మందికి గాను 2,084 మంది పరీక్ష రాశారు. 197 మంది గైర్హాజరయ్యారు. స్క్వాడ్ సభ్యులు, కస్టోడియన్లు 33 పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. తొలి రోజు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదని ఇంటర్మీడియెట్ విద్య జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం తెలిపారు. 144 సెక్షన్ అమలు చేస్తూండటంతో అన్ని కేంద్రాల గేట్లు ఉదయం 9 గంటలకే మూసివేశారు. కొన్నిచోట్ల కొంత మంది విద్యార్థులు తొలి రోజు ఆలస్యంగా వచ్చినప్పటికీ పరీక్షకు అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
తాగునీటి ఇబ్బంది
లేకుండా చర్యలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రానున్న 15 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వీయవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో తాగునీరు సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు, సిబ్బందితో శనివారం ఆమె జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పారిశుధ్య నిర్వహణ, సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్య సేవలపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజలు కలరా, టైఫాయిడ్ తదితర వ్యాధుల బారిన పడకుండా శుద్ధమైన తాగునీరు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని 180 చేతి పంపులకు మరమ్మతులు చేపడతామని సంబంధిత అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్, ఆర్‌డీఓలు తదితరులు పాల్గొన్నారు.
లింగ నిర్ధారణపై
ప్రకటనలిస్తే శిక్ష
రాజమహేంద్రవరం రూరల్: లింగ నిర్ధారణపై ఎటువంటి వాణిజ్య ప్రకటనలూ ఇవ్వరాదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని ఉల్లంఘిస్తే ప్రైవేటు ఆసుపత్రులు, లేబొరేటరీలు, స్కానింగ్ సెంటర్లపై పీసీ – పీఎన్‌డీటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ జరిమానా, మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారని తెలిపారు. జిల్లాలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే ట్రోల్ ఫ్రీ నంబర్ 1800–425–3365కు తెలియజేయాలని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
బడ్జెట్ అంకెల గారడీ
బడ్జెట్ అంకెల గారడీ
బడ్జెట్ అంకెల గారడీ
Comments
Please login to add a commentAdd a comment