
పొగిలిన పేగు బంధం
ఫ రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
ఫ తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు
ఫ రామవరం వద్ద సంఘటన
జగ్గంపేట/ కిర్లంపూడి: అనుకోని ప్రమాదం ఆ కుటుంబాల్లో విషాదం నింపింది.. కుమారుల మృతి ఆ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.. లే కొడుకా, రా కొడుకా అంటూ విగతజీవులుగా మారిన తమ బిడ్డలను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.. ఈ హృదయ విదారక ఘటన జగ్గంపేట మండలం రామవరం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో కిర్లంపూడి మండలం బూరుగుపూడి గాంధీనగర్‌కు చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలవడం అందరినీ కలచివేసింది. చేతికందొచ్చిన కొడుకులు అనంత లోకాలకు వెళ్లారనే కబురుతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతమైంది. జగ్గంపేట పోలీసుల కథనం ప్రకారం..
కిర్లంపూడి మండలం బూరుగుపూడి గాంధీనగర్‌కు చెందిన రౌతుల హర్షవర్థన్ (19), షేక్ అబ్దుల్లా (19), వేణు మణికంఠ (19)లు ఒకే మోటారు సైకిల్‌పై సోమవారం సాయంత్రం పుస్తకాలు కొనుక్కునేందుకు జగ్గంపేట బయలు దేరారు. వీరు రామవరం వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న ట్రాలీని తప్పించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మోటార్ సైకిల్ అదుపు తప్పి ట్రాలీ వెనుక చక్రాల కింద పడిపోయారు. ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. రౌతుల హర్షవర్ధన్, షేక్ అబ్దుల్లా అక్కడికక్కడే మృతి చెందగా, వేణు మణికంఠను జగ్గంపేట సీహెచ్‌సీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మాజీ మంత్రి, జగ్గంపేట వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి తోట నరసింహం బూరుగుపూడి మీదుగా జగ్గంపేట వస్తుండగా ప్రమాదం జరగడాన్ని గమనించారు. తక్షణం అక్కడి నుంచి జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే అప్పటికే ఇద్దరు యువకులు మృతి చెందడం గుర్తించి, గాయపడిన మరో యువకుడిని తక్షణం ఆసుపత్రికి తరలించాలని చెప్పారు. ఆసుప్రతి వద్ద బాధిత కుటుంబాలను తోట నరసింహం, తోట రాంజీ, పాటంశెట్టి సూర్యచంద్ర పరామర్శించారు. సమాచారం అందుకున్న జగ్గంపేట సీఐ శ్రీనివాస్, ఎస్సై రఘునాథరావులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
పుస్తకాల కోసం వెళ్తానని చెప్పి..
బూరుగుపూడికి చెందిన రౌతుల సురేష్, సుమనాగలక్ష్మి అదే గ్రామంలో రోడ్డుపై టీ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె. కుమారుడు రౌతుల హర్షవర్థన్. తాము పడుతున్న కష్టాలు తమ పిల్లలు పడకూడదని రాత్రీపగలు తేడా లేకుండా కష్టపడి పిల్లలను ఆ దంపతులు చదివించుకుంటున్నారు. హర్షవర్థన్ పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 17 నుంచి జరగబోయే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, పెన్నులను కొనుక్కోవాలని చెప్పడంతో డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా వెళ్లి రా నాయనా.. అని చెప్పి పంపిన ఆ తల్లిదండ్రులకు కొద్ది నిమిషాల్లో తమ కొడుకు మరణించాడనే వార్త తెలియడంతో బోరున విలపిస్తున్నారు.
చేదోడుగా ఉంటాడనుకుంటే..
షేక్ సుల్తాన్, మీరాబీ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో మధ్యలోనే పిల్లల చదువులు ఆపేసి వారితో పాటు స్థానికంగా ఉన్న సాగో ఫ్యాక్టరీలో కూలి పని చేసుకుంటున్నారు. తన చిన్న కుమారుడు మృతుడు షేక్ అబ్దుల్లా అప్పటి వరకూ తమ కళ్ల ముందు చలాకీగా తిరిగి అంతలోనే మరణించాడనే వార్త తెలియడంతో జీర్ణించుకులేకపోతున్నామని తల్లిదండ్రులు అంటున్నారు. ఇద్దరు కుమారులు చేదోడుగా ఉంటారనుకున్నామనే సమయంలో చిన్న కొడుకు ఇక లేడనే వార్త కలచివేస్తుందని ఆవేదన చెందుతున్నారు.
ఎవరి కోసం బతకాలి
వేణు వీరబాబు, వరలక్ష్మి దంపతులకు వేణు మణిికంఠ ఒక్కగానొక్క కుమారుడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో మణికంఠ చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. దీంతో అదే గ్రామంలో ఉన్న సైకిల్ రిపేర్ షాపులో పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. తలదాచుకోవడానికి ఇల్లు లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు వెంటాడుతున్నా.. కొండంత అండగా తన కొడుకు ఉన్నాడనే బతుకుతున్నామని ఆ తల్లిదండ్రులు అంటున్నారు. చేదికందొచ్చిన కొడుకు మరణించడంతో తమకు దిక్కెవరని బోరున విలపిస్తున్నారు.
బూరుగుపూడిలో విషాదం
కిర్లంపూడి మండలం బూరుగుపూడి గాంధీనగర్‌కు చెందిన ముగ్గురు యువకుల మరణవార్తతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికందొచ్చిన కుమారులు అనంత లోకాలకు వెళ్లారనే సమాచారంతో అంతా తల్లడిల్లిపోయారు.

పొగిలిన పేగు బంధం

పొగిలిన పేగు బంధం
Comments
Please login to add a commentAdd a comment