
హెచ్‌ఎంను సాగనంపండి..
గొర్రిపూడి విద్యార్థినులు, గ్రామస్తుల డిమాండ్
కరప: అభం, శుభం తెలియని చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న గొర్రిపూడి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు అడబాల కాశీవిశ్వేశ్వరరావును ఇంటికి సాగనంపాలని విచారణాధికారిగా వచ్చిన డీవైఈఓ ఎన్.వెంకటేశ్వరరావు వద్ద గ్రామస్తులు ఏకరవు పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే.. కరప మండలం గొర్రిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంగా అడబాల కాశీవిశ్వేశ్వరరావు పనిచేస్తున్నారు. కొంతకాలంగా 10, 9వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని రెండు నెలల కిందట విద్యార్థినుల తల్లిదండ్రులు కరప పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు హైస్కూల్‌కు వెళ్లి విచారణ జరిపి, హెచ్‌ఎం కాశీవిశ్వేశ్వరరావు వేధింపులకు పాల్పడుతున్నట్టు నిర్ధారించగా, పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తల్లిదండ్రులు, గ్రామస్తులు హెచ్చరించి వదిలేశారు. అయినా హెచ్‌ఎం వైఖరిలో మార్పు రాకపోవడంతో వారం రోజుల క్రితం విద్యార్థినులు, తల్లిదండ్రులు పోలీసు కంట్రోల్ రూమ్‌కు, విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెచ్‌ఎంపై కేసు నమోదు చేసి, ఈ నెల 1న కరప ఎస్‌ఐ టి.సునీత గొర్రిపూడి హైస్కూల్‌కి వెళ్లి విద్యార్థినులను విచారణ జరిపి, నివేదిక పైఅధికారులకు అందజేశారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు సోమవారం కాకినాడ డీవైఈఓ ఎన్.వెంకటేశ్వరరావు, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణలతో కలసి గొర్రిపూడి హైస్కూల్‌కు వెళ్లి గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులతో విడివిడిగా సమావేశమై హెచ్‌ఎం కాశీవిశ్వేశ్వరరావుపై విచారణ జరిపారు. హెచ్‌ఎం గతంలో పనిచేసిన పాఠశాలల్లో కూడా ఇలా అసభ్యకరంగా ప్రవర్తించారని, అయినా ఎక్కడా తనపై చర్యలు తీసుకోకుండా అందరినీ మేనేజ్ చేసి బయటపడ్డాడని తెలిసిందని, ఇప్పుడు తమ గ్రామంలోనూ హెచ్‌ఎం వేధింపులకు పాల్పడుతున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని గొర్రిపూడి గ్రామస్తులు రాత పూర్వకంగా డీవైడీఈఓకు అందజేశారు. తర్వాత ఉపాధ్యాయులకు వివిధ ప్రశ్నలతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చి సదరు హెచ్‌ఎం కాశీవిశ్వేశ్వరరావుపై అభిప్రాయాలు సేకరించారు. అనంతరం 9వ, 10వ తరగతి విద్యార్థినులతో డీవైఈఓతో పాటు ఎంఈఓలు బుల్లికృష్ణవేణి, సత్యనారాయణలు సమావేశమై విచారణ జరిపారు. తమ పట్ల హెచ్‌ఎం ఎలా ప్రవర్తించారో వారు వివరించారు. ఈ నివేదికను డీఈఓకు అందజేస్తామని డీవైఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు.

హెచ్‌ఎంను సాగనంపండి..
Comments
Please login to add a commentAdd a comment