జ్యోతిర్లింగాల దర్శనార్థం పాదయాత్ర
ఫ గుజరాత్ నుంచి 6 నెలల కిందట
ప్రారంభం
ఫ చిన్న వయసులోనే ఆధ్యాత్మికత వైపు
అడుగులు
గండేపల్లి: చిన్న వయసులోనే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడా యువకుడు. జ్యోతిర్లింగాల దర్శనార్థం ఆరు నెలల కిందట ఆ యువకుడు పాదయాత్ర ప్రారంభించాడు. గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ్ జిల్లాలో ఉన్న గ్రామానికి చెందిన 22 ఏళ్ల రాజ్‌మజిత దేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం 2024 ఆగస్ట్ 30న గుజరాత్‌లో సోమనాథ్ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించాడు. జాతీయ రహదారి మీదుగా వస్తున్న అతని పాదయాత్ర సోమవారం మండలంలోని నీలాద్రిరావుపేట చేరుకుంది. అతన్ని పాదయాత్రకు భారతీయ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్‌మజిత మాట్లాడుతూ 10వ తరగతి వరకు విద్యనభ్యసించానని, దేవునిపై ప్రేరణ కలగడంతో ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నట్టు తెలిపాడు. తాను ఉన్న గ్రామానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ గుజరాత్‌లో సోమనాథ్ ఆలయం వద్ద స్వామి సేవలో గడిపేవాడినని, ఆధ్యాత్మిక చింతనతోనే ఈ పాదయాత్రను ప్రారంభించానన్నాడు. గుజరాత్, మహరాష్ట్రలో పుణ్యక్షేత్రాలు, తమిళనాడులో రామేశ్వరంలో దైవ దర్శనం అనంతరం ఆంధ్రకు చేరుకుని తిరుపతిలో స్వామిని దర్శించుకుని, శ్రీశైలంలో మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నట్టు పేర్కొన్నాడు. 16వ నంబర్ జాతీయ రహదారి మీదుగా ఒడిశాలో పూరీ జగన్నాథస్వామి దర్శనం అనంతరం నేపాల్‌లో పుణ్యక్షేత్రాల సందర్శన, కాశీవిశ్వనాథుని దర్శనంతోపాటు భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నట్టు తెలిపాడు. రోజుకు 40 కిలోమీటర్లు నడుస్తున్నానని, 16 వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఈ ఏడాది ఆగస్ట్‌కు తన సొంత రాష్ట్రానికి చేరుకోనున్నట్టు పేర్కొన్నాడు. అతన్ని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వీర్రాజు, సాయి కుమార్, మంగన్న తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment