
నిడదవోలు: పొట్టకూటి కోసం ఉన్న ఊరిని వదిలి.. పొరుగు ప్రాంతానికి వెళ్లిన వారు.. విగత జీవులయ్యారు. ఒకరు రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లి.. కన్నవారికి కడుపుకోత మిగిలిస్తే.. మరొకరు పొరుగూరుకు వెళ్లి.. పని ముగించుకుని వస్తూ తిరిగిరాని లోకానికి పయనమయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలు వారి గ్రామాల్లో విషాదాన్ని నింపాయి.
నిడదవోలు పట్టణంలో ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై ఏపీఈపీడీసీఎల్ డీఈఈ కార్యాలయం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, మండలంలోని పందలపర్రు గ్రామానికి చెందిన సంకు నానిబాబు(18) తాపీ పని చేస్తుంటాడు. చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో పని ముగించుకుని ఇంటికి బైక్‌పై బయలుదేరాడు.
పట్టణంలో ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం వద్దకు వచ్చేసరికి నిడదవోలు నుంచి చాగల్లు వెళుతున్న మినీ వ్యాన్.. మరో వాహనాన్ని తప్పించపోయి అతడి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో నానిబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి తండ్రి చిన్నతనంలోనే మృతిచెందాడు. తల్లి సంకు దుర్గకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. తండ్రి చనిపోవడంతో, నానిబాబు చిన్నతనం నుంచే తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ కుంటుంబ పోషణకు భుజాన వేసుకున్నాడు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటే నానిబాబు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
కుటుంబానికి ఆసరాగా ఉన్న నానిబాబు మరణవార్తను అతడి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాంగ్ రూట్‌లో వచ్చిన మినీవ్యాన్ రూపంలో మృత్యువు అతడిని బలితీసుకుంది. వ్యాన్ డ్రైవర్ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పట్టణ ఎస్సై పరమహంస సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో జొన్నలంక యువకుడి మృతి
పి.గన్నవరం: జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందడంతో అతడి స్వగ్రామమైన జొన్నలంకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల వివరాల మేరకు, హైదరాబాద్‌లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో పి.గన్నవరం మండలం ఎల్.గన్నవరం శివారు జొన్నల్లంకకు చెందిన చందాడి సాయివెంకటకృష్ణ(20)మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన లంకే బాల మణికంఠ లక్ష్మీసాయి తీవ్రంగా గాయపడ్డాడు. వీరు హైదరాబాద్‌లో వెల్డింగ్ పనులు చేస్తూ, వారి కుటుంబాలకు ఆసరాగా ఉన్నారు.
శనివారం రాత్రి వారు పనులు ముగించుకుని బైక్ ఇంటికి వెళ్తుండగా, వనస్థలిపురం వద్ద డివైడర్‌ను ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, వెంకటకృష్ణ మృతి చెందగా, లక్ష్మీసాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో వెంకటకృష్ణ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. అతడి తండ్రి బాలరాజు, తల్లి, సోదరి కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment