
12న యువత పోరుకు వైఎస్సార్ సీపీ
● అటకెక్కిన నిరుద్యోగ భృతి
● ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలలో జాప్యం
● అబద్దపు ప్రచారంతో కూటమికి అధికారం: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు
● సూపర్ సిక్స్ అమలు చేయకపోతే
ఊరుకునేది లేదు : జక్కంపూడి రాజా
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరంట): ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి అమలు పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన శ్రీయువత పోరుశ్రీ పేరిట కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేయనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అన్నారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఆరోజు అన్ని మండలాల్లో సంబరాలు నిర్వహించిన ఆనంతరం కలెక్టర్ కార్యాలయం దగ్గర యువత పోరు ఆందోళన చేసి, వినతి పత్రం అందజేస్తామన్నారు.
విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. యువత పోరు పోస్టర్‌ను రాజమహేంద్రవరంలోని ప్రకాశంనగర్ కార్తికేయ ఎనక్లేవ్‌లోని జక్కంపూడి రాజా నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవిష్కరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, అడపా అనిల్ తదితరులు పాల్గొన్నారు. వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడం దారుణమని విమర్శించారు. నిరుద్యోగులకు 3 వేల రూపాయల భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇంకా అమలు చేయలేదన్నారు. ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించి, అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రాష్ట్రం మరో శ్రీలంక అయి పోతుందని, 14 లక్షల కోట్లు అప్పు అయిపోయిందని ఇలా రకరకాలుగా అబద్ధపు ప్రచారం చేసి, తాము వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన కూటమి నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక తమ ధోరణి మార్చేశారని వేణుగోపాల కృష్ణ విమర్శించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టి అప్పుల సంగతి తేల్చాలని అడిగితే, వాస్తవాలు ఎక్కడ బయట పడతాయో నన్న భయంతో ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ పెట్టి ఇన్నాళ్లూ కాలక్షేపం చేశారన్నారు. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వ అప్పులు 4లక్షల 91వేల కోట్లు, కార్పొరేషన్‌ల అప్పులు ఒక లక్షా 53వేలకోట్లు వెరసి 6లక్షల 46వేల 500కోట్ల రూపాయల అప్పులున్నటు ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. మరి ఎన్నికల్లో 14లక్షల కోట్లు అప్పు అని అబద్ధ ప్రచారం ఎందుకు చేశారని ఆయన నిలదీశారు. పేద వర్గాలకు చెందిన, అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు చదువుకుని అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెట్టారని ఆయన గుర్తుచేశారు. ఈ పథకాన్ని నీరుగార్చాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించిందని, మళ్ళీ ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అసలు పేదలు చదువు కోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి కొనసాగించడం ఇష్టంలేక పేరు మార్చారని అయినా సరే, అమలు చేయడం లేదన్నారు. వలంటీర్లను జగన్ మోహన్‌రెడ్డి నియమించి రూ.5వేలు చొప్పున ఇస్తుంటే, రూ.పదివేలు చొప్పున ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థను గాలికి వదిలేశారని ఆయన ధ్వజమెత్తారు.
ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత : జక్కంపూడి రాజా
ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చక పోవడం దారుణమన్నారు. అందుకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. వలంటీర్లకు 10వేలు వేతనం ఇస్తామని చెప్పి, వాళ్ళను పట్టించుకోకుండా పక్కన పెట్టేయడం శోచనీయమన్నారు. మెగా డీఎస్సీకి తొలిసంతకం అని చెప్పి, ఇప్పటి వరకు డీఎస్సీ తీయలేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అమలుచేయకపోవడం వలన విద్యార్థులు నానా బాధలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించి బడ్జెట్‌లో ప్రస్తావన లేదన్నారు. వైస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వం తరఫున మెడికల్ కాలేజీలను కట్టడం ప్రారంభిస్తే, కూటమి ప్రభుత్వం వాటిని ప్రయివేటు పరం చేయాలని చూస్తోందన్నారు. విద్య,వైద్య రంగాలను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. విద్యార్థులు, యువత సమస్యలను పరిష్కరించాలని, హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 12వ తేదీన యువత పోరు పేరిట ఆందోళన చేపట్టినట్లు చెప్పారు. కూటమి నాయకులు ఎంతో గొప్పగా చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తీరాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment