నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొనే ఈ కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. వైఎస్సార్ సీపీ బుధవారంతో 15వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయపార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, దాడులను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ఎదుర్కొందన్నారు. వాటన్నింటినీ ఎదుర్కొంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్ అలుపెరగని పోరాటం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందించారన్నారు.
పీ–4 సర్వేకి సహకరించండి
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో నిర్వహిస్తున్న పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టిసిపేషన్ (పి–4) సర్వేకి ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం ఒక వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. ఈ సర్వే ద్వారా పేదల్లో పేదలను గుర్తించడం, తలసరి ఆదాయం, ఆరోగ్య, విద్యా ప్రమాణాలు పెంచే ప్రయత్నంలో వారి ఆర్థిక పరిస్థితి, ఏ పని చేస్తే వారికి ఆదాయం వస్తుందనే అంశాలను తెలుసుకునేందుకు ఈ సర్వే చేపడుతున్నారని వివరించారు. సర్వేలో భాగంగా పీజీఆర్‌ఎస్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారంలో సంతృప్తి స్థాయి కూడా తెలుసుకుంటారని తెలిపారు. జిల్లాలోని 1,33,548 ఇళ్లను 502 గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న 3,408 మంది సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటారని పేర్కొన్నారు. వారికి ప్రజలు సహకరించి, తగిన సమాచారం అందించాలని కోరారు. ఈ నెల 18వ తేదీ వరకూ ఈ సర్వే జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీకి
దరఖాస్తుల ఆహ్వానం
కొవ్వూరు: జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి ఎం.పద్మశ్రీ రాణి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్–1, ఆడియో మెట్రీషియన్–2 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిపై భర్తీ చేస్తామన్నారు. బయో స్టాటిస్టిషన్–1, థియేటర్ అసిస్టెంట్–1, జనరల్ డ్యూటీ అటెండెంట్స్–22, ఆఫీస్ సబార్డినేట్స్–3 పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో ఏడాది కాలానికి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 13వ తేదీ ఉదయం 10.30 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న తన కార్యాలయంలో సమర్పించాలని పద్మశ్రీ రాణి సూచించారు.
నిడదవోలు ఆర్‌ఓబీ పనులపై
క్షేత్రస్థాయి తనిఖీలు
రాజమహేంద్రవరం రూరల్: నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులపై అధికారులతో కూడిన నిపుణుల కమిటీ ద్వారా క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రెవెన్యూ, రైల్వే అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిడదవోలు ఆర్‌ఓబీ పనులను వేగవంతం చేయాలన్నారు. దీనికి సంబంధించి క్షేత్ర స్థాయిలో సింగవరం, శెట్టిపేట, తాళ్లపాలెం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించామన్నారు. ఈ పనులపై ఆర్‌డీఓ, రైల్వే ఈఈ, ఇరిగేషన్ ఎస్‌ఈ, జిల్లా వ్యవసాయ అధికారితో కలిసి రెండు మూడు రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేసి, నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఎర్ర కాలువకు వరద వచ్చినప్పుడు ముంపు సమస్య పరిష్కారానికి అధికారులు ఇచ్చే సూచనలను అనుసరించి జిల్లా మంత్రితో చర్చించి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో కొవ్వూరు ఆర్‌డీఓ రాణి సుస్మిత, రైల్వే ఈఈ అశోక్ కుమార్, నిడదవోలు తహసీల్దార్ బి.నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment