‘చెత్త’ విద్యుత్ కేంద్రాన్ని అంగీకరించం
పెదపూడి: బిక్కవోలు మండలం కాపవరం, బలభద్రపురం గ్రామాల వద్ద చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం ఏర్పాటుకు తాము అంగీకరించబోమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఈ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో టన్నులకొద్దీ వచ్చే చెత్తను కాపవరం, బలభద్రపురం గ్రామాలకు తీసుకుని వచ్చి, ఆ చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం ఏర్పాటుకు ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం రెండు నెలలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. సంబంధిత స్థలాన్ని పరిశీలించేందుకు పురపాలక శాఖ మంత్రి నారాయణ స్వయంగా ఈ రెండు గ్రామాల్లో పర్యటించారన్నారు. ఆ విషయం తనకు తెలీదని స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే భాగస్వామి అని, అయినప్పటికీ ఈ విషయం తనకేమీ తెలియదంటూ మొత్తం తప్పును జిల్లా కలెక్టర్‌పై నెట్టివేయడం హాస్యాస్పదమని విమర్శించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు స్థానిక తహసీల్దార్, ఆర్‌డీఓలు గ్రామ పంచాయతీ పాలకవర్గాలను తీర్మానాలు కోరడం ఎమ్మెల్యేకి తెలియకుండానే జరిగిందంటున్నారంటే ఆ గ్రామాలతో పాటు నియోజకవర్గ ప్రజలను మోసం చేయడం కాక మరేమిటని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ప్రశ్నించారు. స్థానిక ప్రజల అభిప్రాయం అవసరం లేదా? తనకు సమాచారం ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే, అధికారులపై ఒత్తిడి చేసి ప్రజాభిప్రాయ సేకరణ నిలుపు చేయించడం ప్రజలను మోసం చేయడం కాదా అని నిలదీశారు. గ్రాసిమ్ పరిశ్రమ వలన ప్రజలు కేన్సర్ బారిన పడుతున్నారని ఎమ్మెల్యే అంటున్నారని, అయితే ఆ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులిచ్చింది అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. దీనికి నాటి టీడీపీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 5న విడుదల చేసిన జీఓ 27 సాక్ష్యమని అన్నారు. ఆ విషయం తెలియనట్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అనుమతులు వచ్చాయంటూ ఎమ్మెల్యే నల్లమిల్లి పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మండిపడ్డారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాదరెడ్డి, కాపవరం సర్పంచ్ సత్యంశెట్టి వెంకట రమణ, ఎంపీటీసీ సభ్యుడు మేడపాటి ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ దీని ఏర్పాటుకు వ్యతిరేకంగా
పెద్ద ఎత్తున ఉద్యమం
ఫ ప్రజల పక్షాన పోరాడతాం
ఫ అనపర్తి మాజీ ఎమ్మెల్యే
డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment