గందరగోళంగా టెన్త్‌ మూల్యాంకనం | - | Sakshi
Sakshi News home page

గందరగోళంగా టెన్త్‌ మూల్యాంకనం

Published Fri, Apr 4 2025 12:09 AM | Last Updated on Fri, Apr 4 2025 12:09 AM

గందరగోళంగా టెన్త్‌  మూల్యాంకనం

గందరగోళంగా టెన్త్‌ మూల్యాంకనం

తాగునీరు కూడా లేదని ఆరోపణ

సరిపడా సబ్జెక్టు టీచర్లు లేక ఆగిన ప్రక్రియ

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా పదో తరగతి మూల్యాంకనం రాజమహేంద్రవరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో తొలి రోజే గందరగోళం నెలకొంది. సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. మూల్యాంకనానికి 101 మంది చీఫ్‌ ఎగ్జామినర్లు, 630 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 200 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అయితే హిందీ, సోషల్‌ విభాగంలో సబ్జెక్టు టీచర్లు పూర్తి స్థాయిలో రాలేదు. దీంతో, ఆ పేపర్ల మూల్యాంకనం అంతంత మాత్రంగానే జరిగింది. మ్యాథ్స్‌, పీఎస్‌, ఎన్‌ఎస్‌ టీచర్లు సరిపడా స్థాయిలో రిపోర్టు చేసినా, మిగిలిన టీచర్లను సాయంత్రం వరకూ రిలీవ్‌ చేయలేదు. దీంతో వారు నిరసన తెలిపారు. మూల్యాంకనానికి వచ్చిన ఉపాధ్యాయులు వసతులు లేక నానా అవస్థలూ పడ్డారు. మహిళా ఉపాధ్యాయుల పరిస్థితి అయితే ఇక చెప్పక్కరనేలేదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఉపాధ్యాయులు ఆరోపించారు. అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరైనా వారందరికీ ఒకే టెంట్‌ వేశారు. అది చాలకపోవడంతో చాలా మంది చెట్ల కింద, ఇతర ప్రాంతాల్లోను గడిపారు. తాగేందుకు మంచినీరు సైతం ఏర్పాటు చేయలేదు.

శ్రీరామ నవమి

వేడుకలకు శ్రీకారం

అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం చుట్టారు. రత్నగిరిపై రామాలయం వద్ద గురువారం ఉదయం పండితులు పందిరి రాట వేశారు. తొలుత పందిరి రాటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పూలతో అలంకరించి, పూజలు చేశారు. అనంతరం సుస్వర వేద మంత్రోచ్చారణ నడుమ రాట వేశారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వీర్ల సుబ్బారావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ రామ్మోహనరావు తదితరులు పందిరి రాటకు పూజలు చేశారు. కార్యక్రమంలో వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, రామాలయ అర్చకుడు దేవులపల్లి వరప్రసాద్‌, స్పెషల్‌ గ్రేడ్‌ వ్రత పురోహితుడు చామర్తి కన్నబాబు, పురోహితుడు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి శ్రీరామ నవమి వేడుకలు

ఈ నెల ఐదో తేదీ నుంచి 13వ తేదీ వరకూ తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవాలను సాక్షాత్తూ సత్యదేవుడు, అమ్మవారు పెళ్లిపెద్దలుగా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు సీతాదేవి, శ్రీరామచంద్రమూర్తిని వధూవరులుగా అలంకరించడంతో శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభమవుతాయి. శ్రీరామ నవమి సందర్భంగా ఆరో తేదీ ఉదయం 10 గంటల నుంచి సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. 7న ప్రత్యేక పూజలు, 8న పండిత సదస్యం, 9, 10 తేదీల్లో సీతారాములకు ప్రత్యేక పూజలు, 11న సీతారాముల వనవిహారోత్సవం, 12న శ్రీచక్రస్నానం, దండియాడింపు నిర్వహిస్తారు. 13వ తేదీ రాత్రి రామాలయంలో నిర్వహించే శ్రీపుష్పయాగంతో కార్యక్రమాలు ముగుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement