
రక్తదానంపై అవగాహనకు సైకిల్ యాత్ర
తుని రూరల్: రక్తదానంపై యువతలో అవగాహన, చైతన్యం తీసుకువచ్చే లక్ష్యంతో సేవ్ బ్లడ్ పేరుతో తుని మండలం టి.తిమ్మాపురానికి చెందిన ఆకేటి బుజ్జిబాబు శుక్రవారం సాయంత్రం సైకిల్ యాత్ర చేపట్టాడు. తుని మండలం వి.కొత్తూరు సమీపంలోని పెట్రోల్ బంకులో రాత్రి బస చేశాడు. ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ, నాలుగు నెలల పాటు తన యాత్ర కొనసాగుతుందన్నారు. రక్తదానం వలన ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని, దీనివలన ఎటువంటి నష్టమూ లేదని యువతకు అవగాహన కల్పించడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ అవతరణకు ప్రధాన కారకుడైన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కూడా నేటి తరానికి తెలియజేస్తానన్నారు. పట్టణాలు, ప్రధాన గ్రామాల్లో తన యాత్ర కొనసాగుతుందని తెలిపారు. గతంలో బాలికలను, పక్షులను, మొక్కలను, జంతువులను రక్షించాలన్న నినాదంతో దేశంలోని 28 రాష్ట్రాల్లో 8 నెలల పాటు సైకిల్ యాత్ర చేశానన్నారు. అలాగే, కోల్‌కతాలో దాడికి గురైన మెడికో మోహితకు న్యాయం జరగాలని విజయవాడ నుంచి కోల్‌కతాకు 1,400 కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. నేపాల్‌లో అన్నపూర్ణ బేస్ క్యాంపు నుంచి 4,130 మీటర్ల ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించి, జాతీయ జెండాను ఎగురవేశానని బుజ్జిబాబు తెలిపారు.