
ప్రభుత్వాసుపత్రిలో దుర్భర పరిస్థితులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, పరిశుభ్రత వంటి అంశాలపై దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. నిత్యం ఎన్నో కేసులు వచ్చే ఈ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేకుంటే ఎలాగని ప్రశ్నించారు. బుధవారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లో పరిస్థితులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన కేసులలో 60 శాతం విఫలమవుతున్నాయని ఆరోపించారు. ఎవరినైనా ఇక్కడ చేరిస్తే, సీరియస్‌గా ఉందని, కాకినాడ తరలిస్తున్నారని, అలాంటప్పుడు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పుతున్న సందర్భాలున్నాయని చెప్పారు. గర్భవతులు చేరితే లేబర్ రూమ్‌కి కూడా తీసుకెళ్లడం లేదని, ఫలితంగా బెడ్ మీదే ప్రసవాలు అయిపోతున్నాయని, మంగళవారం రాత్రి కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుందని చెప్పారు. మార్చురీలో దాతలు ఇచ్చిన వెంటిలేటర్లు, ఐస్ కేసులున్నా వాడడం లేదన్నారు. తాను వస్తున్నానని తెల్సి వార్డుల్లో శుభ్రం చేయడం, కరెంట్ పునరుద్ధరించడం చేశారని చెప్పారు. ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఏమిటి, డాక్టర్లు, సిబ్బంది ఉన్నారా లేదా అనే విషయాలు కూడా రివ్యూ చేయకుండా నిర్లక్ష్యంగా ఉండడం దారుణమని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న ఇబ్బందులపై, సమస్యలపై వీడియోలు చేసేది రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికేనని ఆయన స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు కరోనా సమయంలో పడిన ఇబ్బందులు గమనించి ఆసుపత్రిలో పరిస్థితులు మెరుగు పరచడం కోసం చర్యల్లో భాగంగా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని భరత్ పేర్కొన్నారు. దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా ? అని ప్రశ్నించారు. వీడియో తీసిన వీరా అనే యువకుడు మాట్లాడుతూ ఒక ముసలాయన రోడ్డుపై పడివుంటే, ఆటోలో తీసుకొచ్చి చేర్చామని, స్ట్రెచర్ మీద పడుకోబెట్టి కుట్లు వేసే రూమ్‌కి తీసుకెళ్లారని, అయితే అక్కడ కూడా విద్యుత్ లేదని చెప్పాడు. 500 పడకల ఆసుపత్రి అయినందున ఇక్కడ 24గంటలూ కరెంట్ ఉండాలని, కనీసం జనరేటర్ కూడా లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
కనీస సౌకర్యాలు లేవు,
తగిన సిబ్బంది లేరు
మాజీ ఎంపీ భరత్‌రామ్

ప్రభుత్వాసుపత్రిలో దుర్భర పరిస్థితులు